AP Cabinet: ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఖాళీగా ఉన్న ఒక్క మంత్రి పదవితో పాటు మరో రెండు మంత్రి పదవులను భర్తీ చేస్తారని టాక్ నడుస్తోంది. అదే జరిగితే ఏ ఇద్దరిని తీస్తారు? కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తారు అన్నది తెలియాల్సి ఉంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. ఒకరిద్దరూ మంత్రుల పనితీరుపై అభ్యంతరాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం నడుస్తోంది. అందుకే ఓ ఇద్దరు మంత్రులను తప్పించి కొత్తగా.. ఇద్దరిని తీసుకుంటారని కూడా టాక్ నడుస్తోంది. ప్రధానంగా రాయలసీమ నుంచి ఒకరు, ఉత్తరాంధ్ర నుంచి ఒక మంత్రి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. వారిద్దరిని తొలగించి.. మొత్తం ముగ్గురిని కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని తెలుస్తోంది.
* పల్లా శ్రీనివాస్ కు ఛాన్స్
రాజ్యసభ సమీకరణల నేపథ్యంలో నాగబాబుకు అవకాశం దక్కలేదు. దీంతో ఆయనను క్యాబినెట్ లోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ఖాయంగా తేలింది. అదే సమయంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సైతం మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. టిడిపి సభ్యత్వ నమోదులో క్రియాశీలక పాత్ర పోషించారు ఆయన. పైగా సిట్టింగ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై 95 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆపై బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇప్పటివరకు విశాఖ నగరానికి చాన్స్ ఇవ్వలేదు. మంత్రి పదవి కేటాయించలేదు. పల్లా శ్రీనివాస్ కు పదవి ఇవ్వడం ద్వారా ఆ లోటు కూడా తీరనుంది.
* కడపకు ఈసారి అవకాశం
అయితే మూడో మంత్రి పదవి ఎవరికి ఇస్తారు? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే కడప జిల్లాకు చెందిన రెడ్డప్ప గారి మాధవి రెడ్డికి పదవి ఖాయమని ప్రచారం నడుస్తోంది. అదే జిల్లాకు చెందిన మంత్రి పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఆయనను ఎంపిక చేసిన నాటి నుంచి వివాదాలు వస్తున్నాయి. చంద్రబాబు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శ కూడా ఉంది. ఈ తరుణంలో మాధవి రెడ్డి అయితే కడప జిల్లాలో ప్రభావం చూపగలరని.. వైసిపికి పూర్తిస్థాయిలో చెప్పగలరని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అయితే మాధవి రెడ్డికి ఛాన్స్ ఇస్తే కడపలో వైసిపి హవాకు చెప్పగలరని పార్టీ హై కమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే మహిళా మంత్రి ఒకరు క్యాబినెట్లోకి వస్తారు. ఈ ఎన్నికల్లో రెడ్డప్ప గారి మాధవి రెడ్డి కడప అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పై ఘన విజయం సాధించారు. రికార్డు స్థాయిలో గెలుపొందారు. మంత్రిగా ఎంపిక అయితే మాత్రం అది ఒక రికార్డుగా పరిగణించబడునుంది.