Pawan Kalyan: జనసేన అధినేత పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? భీమవరం నుంచా? లేకుంటే గాజువాకా? ఈ రెండింటిలో ఒకచోటా? ఇలా రకరకాల చర్చ నడుస్తోంది. మొన్నటికి మొన్న రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. అందులో దాదాపు టిడిపి, జనసేన కీలక నాయకుల నియోజకవర్గాలు ఖరారయ్యాయి. ఒక్క పవన్ సీటు విషయంలో మాత్రం స్పష్టత లేదు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, అచ్చెనాయుడు, నాదెండ్ల మనోహర్.. ఇలా అందరి నియోజకవర్గాలు ఖరారయ్యాయి. కానీ పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది మాత్రం గోప్యతగా ఉంచారు. దీంతో అందరూ ఆయన సొంత నియోజకవర్గమైన భీమవరం నుంచి బరిలో దిగుతారని భావించారు. కానీ ఆయన వేరే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల పోటీ చేశారు. విశాఖ జిల్లా గాజువాక తో పాటు గోదావరి జిల్లా భీమవరంలో బరిలో దిగారు. కానీ రెండు చోట్ల ఓడిపోయారు. ఎన్నికల తర్వాత రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నా.. ప్రత్యేకంగా ఒక నియోజకవర్గం పైనే దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారా? అన్నది ప్రశ్నార్ధకంగా మిగులుతోంది. వాస్తవానికి గత నాలుగు సంవత్సరాలుగా పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఇవి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విశాఖ నుంచి అనంతపురం జిల్లా వరకు దాదాపు పది నియోజకవర్గాలు పవన్ కు అనుకూలంగా ఉన్నట్లు నివేదికలు అందాయి. అయితే ఇప్పుడు పొత్తు, సీట్ల సర్దుబాటు పూర్తయినా.. పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడం గమనార్హం.
అయితే తాజాగా పోటీ చేయబోయే నియోజకవర్గంపై ఒక ప్రచారం జరుగుతోంది. ఆయన పిఠాపురం నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మొన్నటి అభ్యర్థుల ప్రకటన సమయంలో… పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని వెల్లడిస్తారని అంతా భావించారు. కానీ ఆయన మనసు మార్చుకోవడం వల్లే ప్రకటించలేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి నుంచి పవన్ గుణపాఠం నేర్చుకున్నారు. భారీ మెజారిటీతో విజయం సాధించి విమర్శలకు చెక్ చెప్పాలని భావిస్తున్నారు. అందుకే పిఠాపురం నియోజకవర్గాన్ని వ్యూహాత్మకంగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఆ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అధికం. దాదాపు 90 వేలకు పైగా ఓట్లు ఉన్నాయి. అక్కడ నుంచి పోటీ చేస్తే భారీ మెజారిటీతో పవన్ గెలుపొందడం ఖాయమన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే ఆ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
పొత్తులో భాగంగా కాకినాడ పార్లమెంట్ స్థానం కూడా జనసేనకు కేటాయించుతున్నారు. ఇప్పటికే కాకినాడ రూరల్ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. పంతం నానాజీ పేరును ప్రకటించారు. అదే పార్లమెంట్ స్థానంలో పిఠాపురం ఉంటుంది. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం కాకినాడ పార్లమెంట్ స్థానంపై పడుతుందని.. రూరల్ అసెంబ్లీ స్థానాన్ని సైతం దక్కించుకోవచ్చని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అన్నింటికీ మించి పిఠాపురంలో జనసేన నాలుగు ఎకరాల భూమిలో ఉన్న హెలిపాడ్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. దీంతో పవన్ కోసమే ఆ హెలిపాడ్ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని చెబుతున్నాయి. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.