Jagan latest strategy: ఉత్తరాంధ్ర పై జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ఫోకస్ పెట్టారా? పార్టీని బలోపేతంపై దృష్టి పెట్టారా? వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకున్నారా? అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు ఇప్పుడే వ్యూహం రూపొందిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2029 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు తెచ్చుకుంటేనే వైసీపీకి ఛాన్స్ ఉంటుంది. లేకుంటే మాత్రం ఇబ్బందికరమే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు ఎన్నికలను ఎదుర్కొంది. అందులో రెండింట దారుణ పరాజయం చవిచూసింది. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం.. ఉత్తరాంధ్రలో ఆరు సీట్లను గెలుచుకుంది తెలుగుదేశం పార్టీ. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది ఉత్తరాంధ్రలో. అందుకే మరోసారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కచ్చితంగా ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.
ఇక్కడ మెరుగైన సీట్లు దక్కించుకుంటే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమ ( Rayalaseema ) అండదండగా నిలుస్తూ వస్తోంది. అక్కడ 70కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014లో వైసీపీకి అక్కడ మెజారిటీ వచ్చింది. 2019లో స్విప్ చేసింది. 2024లో మాత్రం ఓ ఏడు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అందుకే వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో మెజారిటీ సీట్లు దక్కించుకొని.. ఉత్తరాంధ్రలో మెరుగైన స్థానాలు పొందితే.. మ్యాజిక్ ఫిగర్ దాటవచ్చు అన్నది జగన్మోహన్ రెడ్డి అంచనా. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో వచ్చే స్థానాలను అనుసరించి మాత్రమే వైసిపి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకే మూడున్నర ఏళ్ల ముందే ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి. అందుకే సీనియర్లను యాక్టివ్ చేస్తున్నారు.
20 సీట్లు పై గురి..
ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో ఓ 20 స్థానాలపై గురిపెట్టినట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో సీనియర్లుగా బొత్స సత్యనారాయణ,ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణ దాసు వంటి సీనియర్లు ఉన్నారు. వారితోనే ఈసారి రాజకీయం చేసి ఉత్తరాంధ్రను దక్కించుకోవాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటు పరాన్ని నిరసిస్తూ నర్సీపట్నంలో ఆందోళన చేయనున్నారు. మొత్తం ఉత్తరాంధ్రను ఆకట్టుకునేలా భారీ ప్లాన్ రూపొందించారు. విశాఖలో భారీగా పరిశ్రమల ఏర్పాటు జరుగుతోంది. పెట్టుబడులు కూడా వస్తున్నాయి. అది కచ్చితంగా కూటమికి ప్లస్ అవుతుంది. అందుకే ఈ పరిశ్రమల ఏర్పాటుకు జరుగుతున్న భూ సమీకరణ, ప్రభుత్వ భూముల కేటాయింపులో జరుగుతున్న లోపాలపై పోరాటం చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. తద్వారా కూటమి దూకుడుకు కళ్లెం వేయడంతో పాటు పార్టీని కొంతవరకు నిలబెట్టవచ్చని భావిస్తున్నారు. ఆయన ప్రయత్నాలు మరి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.