AP People Data : విపక్షంలో ఉంటే ఒక మాట.. అధికారంలోకి వస్తే మరో మాట.. ఇది ఏపీ సీఎం జగన్ బాట. ఆయన చెబుతున్న మాటలు ఎంత వింతగా ఉంటాయంటే.. తనకు మీడియా సపోర్టు లేదంటారు. సాక్షి మీడియా తనది కానట్టు వ్యవహరిస్తారు. అదే సాక్షి పత్రికపై మీ అభిప్రాయం ఏంటని వలంటీర్లతో ప్రశ్నలు వేయిస్తుంటారు. విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు మీ డేటా చోరీ చేయిస్తున్నారని ఆరోపణలు చేసేవారు. మీఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు ఎక్కడికో వెళ్లిపోతున్నాయో అంటూ తన ప్రకటనలతో అప్పటి టీడీపీ ప్రభుత్వంపై విషం నింపేవారు. ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చాక వలంటీర్ల ద్వారా సేకరిస్తున్న డేటా లోక కళ్యాణం కోసమేనని సెలవిస్తున్నారు. అందులో తప్పేముందని బుకాయిస్తున్నారు. చివరకు మీ ఇంట్లో మందు తాగే అలవాటు ఉందా? వివాహేతర సంబంధాలు ఉన్నాయా? అన్న వివరాలు సేకరిస్తున్నారంటే టెంపరితనం ఇట్టే బయటపడింది.
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీ మూడు నాలుగు నెలలకు ఒకసారి సర్వేలు జరగుతునే ఉన్నాయి. డేటా కలెక్షన్లు సేకరిస్తున్నారు. సంక్షేమ పథకాలు, పౌరసేవల పేరిట వలంటీర్లు ఇదో నిరంతర ప్రక్రియగా చేపడుతున్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ అధికారులు సమాచారం సేకరించగా… జగన్ పాలనలో వలంటీర్లు ఆ వివరాలు తీసుకుంటున్నారు. ఒక అడుగు ముందకేసి అధికార వైసీపీకి, ముఖ్యమంత్రి పత్రికకు అనుకూలం ఎవరో, వ్యతిరేకులు ఎవరో, తటస్థంగా ఉన్నదెవరో కూడా తెలుసుకుంటున్నారు. కుటుంబ వ్యక్తిగత జీవితాల గురించి సైతం ఆరాతీస్తున్నారు. గతంలో చంద్రబాబు చేసింది నేరమైతే ఇప్పుడు జగన్ చేస్తున్నదేమిటి? సంక్షేమ పథకాల సమాచార సేకరణలో రాజకీయ పార్టీల అభిమానుల వివరాలు సేకరించడం ఎందుకు? అంటే… ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమే అని చెప్పక తప్పదు. ఒప్పుకోక తప్పదు కూడా.
టీడీపీ ప్రభుత్వం ప్రజాసాధికార సర్వే కింద డేటా తీసేసుకుంది. ప్రభుత్వ డేటా సెంటర్లలోనే నిల్వ చేసేది. అక్కడ నుంచే ప్రభుత్వ శాఖలు డేటాలను తీసుకునేవి. సంక్షేమ పథకాలు, పౌరసేవలకు సంబంధించి ఆ డేటాను వినియోగించుకునేవారు. చివరకు బ్యాంకులు,వాణిజ్య సంస్థలు సైతం ఆ డేటాపైనే ఆధారపడేవి. కానీ జగన్ మాత్రం ఈ విషయంలో ప్రజల్లో ఎన్నెన్నో అనుమానాలు కలిగించగలరు. ఈ డేటా మొత్తం ఎటో వెళ్లిపోతోందని ప్రజలను నమ్మించడంలో సక్సెస్ అయ్యారు. చివరకు న్యాయస్థానాల్లో కేసులు సైతం వేశారు. తాను అధికారం వచ్చే వరకూ ఓట్లు రాల్చే ఆరోపణగా తన అమ్ముల పొదిలో జగన్ దాచుకున్నారు. అయితే నాడు చంద్రబాబు చేసింది తప్పు అయితే.. ఇప్పుడు తాను చేస్తున్నదేమిటో జగన్ కే ఎరుక?
వైఎస్సార్ నవశకం పేరిట నిర్వహించిన సర్వేలో ప్రతీ కుటుంబ వ్యక్తిగత వివరాలన్నీ డేటా రూపంలో సేకరించారు. బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, వైఎ్‌సఆర్ పెన్షన్ కానుక, విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి, కాపునేస్తం, టైలర్‌లు, ర జకులు, నాయీబ్రాహ్మణులు, పాస్టర్‌లు, మౌజమ్‌లకు గౌరవవేతనాలు, ఇలా అనేక సంక్షేమ పథకాల కోసం డేటాసేకరించారు. ఇలా సేకరించిన డేటాను ఎక్కడ నిక్షిప్తం చేశారంటే మాత్రం ఎటువంటి సమాధానం లేదు. అయితే ఇదంతా హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని ఓ ప్రైవేటు ఏజెన్సీకి వెళుతుందన్న ఆరోపణలున్నాయి. దానిపై కూడా క్లారిటీ ఇచ్చే సాహసం జగన్ సర్కారు చేయడం లేదు. అయితే ఈ పరిణామాలన్నీ గ్రహించిన సగటు ప్రజలు మాత్రం డేటా చోరీలో టీడీపీ, వైసీపీలు దెందుకు దెందేనన్న నిర్ణయానికి వస్తున్నారు.