Thalliki Vandanam : ఏపీ ప్రభుత్వం( AP government) సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టింది. ఈ పథకాల అమలుకు ఒక క్యాలెండర్ను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్యాలెండర్ ప్రకారం పథకాలను క్రమం తప్పకుండా అమలు చేయాలని.. జూన్లో పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం పథకం అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని.. ఈ పథకాలకు ఎంత ఖర్చవుతుందో నివేదిక ఇవ్వాలని క్యాబినెట్ సమావేశంలో అధికారులను ఆయన ఆదేశించారు. ఈ నెలలో ఏ పథకం అమలు చేస్తామో చెబితే ప్రజల్లో ప్రభుత్వం పై నమ్మకం పెరుగుతుందని.. వార్షిక క్యాలెండర్ ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో మరో మూడు వారాల్లో తల్లికి వందనం నిధులు జమ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read : కొత్త రూల్స్ అమలు.. పర్సనల్ లోన్ తీసుకొని ఇలా చేస్తే జైలుకే..
* రకరకాలుగా ప్రచారం..
తల్లికి వందనం పై( Thalliki Vandanam ) రకరకాలుగా ప్రచారం సాగింది. తగ్గించి ఇస్తారని కొందరు.. రెండు విడతల్లో సాయం చేస్తారని మరికొందరు చెప్పుకొచ్చారు. కానీ ఒకే విడతగా ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 15 వేల రూపాయలు జమ చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చకు వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనందున.. ఒకేసారి పదివేల కోట్ల రూపాయలు ఇవ్వడం కష్టం అవుతుందని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. రెండు విడతలుగా ఇస్తే బాగుంటుందని సూచించారు. అయితే ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం మరో ఆలోచనకు తావు లేదని తేల్చేశారు. ఒకే విడతలో తల్లికి వందనం డబ్బులను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా.. పాఠశాలలు తెరిచేలోగా డబ్బులు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మంత్రులు కొత్తగా ఆలోచించాలని సూచించారు. పింఛన్లు పంపిణీ చేసినప్పుడు, మత్స్యకారులకు డబ్బులు ఇచ్చేటప్పుడు తాను లబ్ధిదారులతో మాట్లాడానని.. వారిలో సంతృప్తి శాతం స్పష్టంగా కనిపించిందని చెప్పుకొచ్చారు. అందుకే మంత్రులు కూడా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
* ఏడాది తరువాత…
గత ఏడాది జూన్లో కూటమి ప్రభుత్వం( Alliance government ) అధికారంలోకి వచ్చింది. అప్పట్లో తల్లికి వందనం అమలు చేస్తారని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. ప్రజల్లో కూడా ఓ రకమైన అసంతృప్తి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలో కచ్చితంగా పథకం అమలు చేసేందుకు నిర్ణయించారు సీఎం చంద్రబాబు. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా.. అంటే జూన్ 12 నాటికి విద్యార్థుల తల్లుల ఖాతాలో 15 వేల రూపాయల చొప్పున జమ చేసేందుకు నిర్ణయించారు. ఎటువంటి కోత విధించకుండా.. ఒకే విడతలో నిధులు జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ పథకం అమలు చేసే పనిలో విద్యాశాఖ అధికారులు. ఎటువంటి కోత లేకుండా ఈ నిధులు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుండడంతో తల్లిదండ్రుల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది.
* సామాన్యులకు ఉపశమనం..
సాధారణంగా విద్యా సంవత్సరం( academic year) ప్రారంభంలో తల్లిదండ్రులపై చాలా రకాలుగా భారం పడుతుంది. ముఖ్యంగా ఫీజులతో పాటు పుస్తకాలు, ఇతరత్రా ఖర్చులు ఉంటాయి. ఆ సమయంలో చాలామంది అప్పులు కూడా చేస్తారు. సరిగ్గా అటువంటి సమయంలోనే ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పేరిట సాయం చేయనుండడం విశేషం. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తింప చేయడంతో.. సామాన్య, మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగించే విషయం.