Telugu states debt: జాతీయస్థాయిలో తెలుగు రాష్ట్రాలు( Telugu States ) మరోసారి చర్చకు దారి తీసాయి. ఏపీతోపాటు తెలంగాణ ఓ విషయంలో అగ్రస్థానంలో నిలిచాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తొలి రెండు స్థానాల్లో ఈ రెండు రాష్ట్రాలు కొనసాగాయి. అయితే అది అప్పుల ఊబిలో. కేంద్ర గణాంక శాఖ సర్వే నివేదిక 2020- 21 ప్రకారం ఏపీ 43.7 శాతం మంది, తెలంగాణలో 37.2 శాతం మంది అప్పుల్లో చిక్కుకున్నట్లు తేల్చింది. ఈ లెక్కన ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. అయితే ఆర్థికంగా ప్రజలను బ్యాంకులతో అనుసంధానం చేయడంలో ఏపీ మెరుగైన స్థితిలో ఉంది. ఏపీలో 15 సంవత్సరాలు పైబడిన వారిలో 92.3 శాతం మందిని బ్యాంకు వ్యవస్థల్లోకి తీసుకురావడంలో ఏపీ ప్రభుత్వం సఫలం అయింది. అయితే ఈ విషయంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. 95.9%తో అగ్రస్థానంలో ఉంది. కానీ తెలంగాణ మాత్రం ఈ విషయంలో 14వ స్థానంలో నిలవడం ఆందోళన కనిపిస్తోంది.
ప్రజలతో బ్యాంకుల అనుసంధానం..
ప్రజలను బ్యాంకులతో అనుసంధానించడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని కొంతవరకు మెరుగుపరచవచ్చు. అందుకే 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతాలు( bank accounts ) విధిగా తెరిపించాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. అయితే ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల కంటే ఈశాన్య రాష్ట్రాలు పరిస్థితి మెరుగ్గా ఉంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ విషయంలో అక్కడి రాష్ట్రాలు ప్రత్యేక శ్రద్ధ కనబరిచాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్, బీమా, పెట్టుబడులు వంటి ఆర్థిక సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలు ఆర్థికంగా బాగుంటారు కానీ.. ఎక్కువమందిని అప్పుల సమస్య వెంటాడుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో 80 శాతం మంది ప్రజలు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉంటారు. అయితే అక్కడ ప్రజల్లో 7.4 శాతం మందికి అప్పులు ఉన్నాయి. అందుకే దక్షిణాది రాష్ట్రాల కంటే మెరుగైన స్థితిలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఉన్నారు.
మతాల ప్రాతిపదికన సైతం..
అయితే ఈ గణాంకాలు కేవలం రాష్ట్రాల మధ్య కాదు.. మతాల ప్రాతిపదికన కూడా తీసుకున్నారు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్( financial inclusion) హిందువుల్లో 88.1, ముస్లింలలో 80.8, ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే పొదుపు మంత్రం పాటించే మహిళలు మాత్రం పురుషులకంటే వెనుకంజలో ఉన్నారు. 89.8%తో పురుషులు ఉండగా.. మహిళలు మాత్రం 84.5%తో ఉన్నారు. ఇక్కడ మరో విషయాన్ని గుర్తించుకోవాలి. ఎక్కువమంది సభ్యులు ఉన్న కుటుంబాలపై అప్పుల భారం తక్కువగా ఉంది. తక్కువ మంది సభ్యులు ఉన్న కుటుంబాలపై మాత్రం ఎక్కువగా అప్పుల భారం ఉంది. అయితే ఈ గణాంకాలను అనుసరించి రాష్ట్రాలు చర్యలు చేపడితే.. ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరే అవకాశం ఉంది.