Telugu Media: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. సతివియోగానికి గురయ్యారు. ఆ సమయంలో ఆయనకు లక్ష్మీపార్వతి దగ్గరయ్యారు. చాలా పరిణామల తర్వాత ఆమెను ఆయన వివాహం చేసుకున్నారు. లక్ష్మీపార్వతి సీనియర్ ఎన్టీఆర్ భార్యగా పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం చంద్రబాబు నాయుడుకు ఇష్టం ఉండేది కాదు. అందువల్ల వేరుకుంపటి అనేది ఏర్పడింది. ఆ సమయంలో చంద్రబాబుకు ఈనాడు సహకరించింది. రామోజీరావు ఆధ్వర్యంలో ఈనాడు లక్ష్మీపార్వతిని ఎన్ని రకాలుగా డీ ఫేమ్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. నాటి ఈనాడు రాతలను, శ్రీధర్ గీసిన గీతలను చూస్తే కచ్చితంగా అర్థమవుతుంది. ఆ రోజుల్లో చంద్రబాబుకు ఈనాడు బే షరతుగా మద్దతు ఇచ్చింది కాబట్టి.. సీనియర్ ఎన్టీఆర్ ను తులనాడేందుకు వెనుకాడ లేదు. ఆయన వివాహం చేసుకున్న మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు ఆలోచించలేదు. ఆ తర్వాత ఈనాడు తనకు గిట్టని వారిపై రాళ్లు వేయడంలో మరింత ఆరితేరింది.
ఇక ఆంధ్రజ్యోతి విషయానికొస్తే ఈ పత్రిక ది ఒక డిఫరెంట్ స్టైల్. ఈనాడు అంతర్గతంగా విమర్శలు చేస్తుంది. కానీ ఆంధ్రజ్యోతి అలా కాదు ఏదైనా ఓపెన్ గానే.. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆమె సోదరి షర్మిల పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆంధ్రజ్యోతి ఆమె వ్యక్తిత్వ హ నానికి పాల్పడే వార్తలను ప్రచురించిందనే ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఓ టిడిపి నాయకుడు షర్మిలకు, ఓ సినీ నటుడికి సంబంధం ఉందని చేసిన విమర్శలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి ప్రచురించింది. కానీ ఎప్పుడైతే షర్మిల జగన్ క్యాంప్ నుంచి బయటికి వచ్చిందో.. మళ్లీ ఆమెకు అనుకూలంగా వార్తలను ఆంధ్రజ్యోతి రాయడం మొదలుపెట్టింది.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు ఉందని ముందుగా వార్త ప్రచురించింది ఆంధ్రజ్యోతినే. అయితే ఇలాంటి వార్త రాసిన సమయంలో కనీసం కవిత వివరణ కూడా ఆంధ్రజ్యోతి తీసుకోకపోవడం విశేషం.
ఇక నమస్తే తెలంగాణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. అప్పటి గవర్నర్ తమిళసై సౌందర రాజన్ పై నమస్తే తెలంగాణ ఏ స్థాయిలో విషం కక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నర్ ను విమర్శిస్తూ.. ఒక మహిళ అని చూడకుండా ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేసింది.. చివరికి గవర్నర్ దిష్టిబొమ్మలను తగులబెట్టించేందుకు కూడా వెనకాడ లేదు.. ఇక భారత రాష్ట్ర సమితికి చెందిన ఓ ఎమ్మెల్సీ అయితే గవర్నర్ ను అనకూడని మాట అన్నాడు.
ఇక సాక్షి కూడా అంతే.. గతంలో షర్మిల తో అవసరం ఉన్నప్పుడు ఆమె గురించి ప్రముఖంగా కథనాలను ప్రచురించింది. పేజీలకు పేజీలు విశ్లేషణలు రాసింది. కానీ ఎప్పుడైతే జగన్ తో విభేదాల వల్ల ఆమె బయటకు వెళ్లిపోయిందో.. అప్పటినుంచి ఆమె వ్యక్తిత్వాన్ని కూడా హననం చేయడం మొదలుపెట్టింది. ఒకప్పుడు షర్మిల కటౌట్లతో బ్యానర్ వార్తలను ప్రచురించిన సాక్షి.. ఆ తర్వాత అదే స్థాయిలో ఆమెను తిడుతూ కారణాలను ప్రచురించే స్థాయికి దిగజారింది. ఇక ప్రస్తుతం కాదంబరి అనే బాలీవుడ్ నటి విషయంలోనూ సాక్షి ఇదే దిగజారుడు పాత్రికేయాన్ని ప్రదర్శిస్తోంది. ఆమె వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ అడ్డగోలుగా వార్తా కథనాలను ప్రసారం చేస్తోంది. చివరికి ఆమెను హాని ట్రాప్ కు పాల్పడే మహిళగా చిత్రీకరించేందుకు కూడా వెనుకాడటం లేదు. ఆమె వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ.. అసలు ఆమెకు వ్యక్తిత్వమే లేదంటే సాక్షి కథనాలను ప్రసారం చేస్తున్న తీరు జుగుస్సను కలగజేస్తోంది..
అంటే పై పత్రికలు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన మీడియా గా ఉన్నాయి కాబట్టి వాటి గురించి ప్రస్తావించాల్సి వచ్చింది. ఉదయం లేస్తే విలువల గురించి పదేపదే చెప్పే ఈ పత్రికలు ఆడవాళ్ళ విషయానికి వచ్చేసరికి దిగజారుడు పాత్రికేయాన్ని ప్రదర్శిస్తున్నాయి..ఆఫ్ కోర్స్ వాటి యాజమాన్యాల లక్ష్యం అది కాబట్టి ఆ స్థాయిలో దిగజారుతున్నాయి.. అన్ని పత్రికలకు పొలిటికల్ లైన్ లు ఉండడంతో.. వాటి ప్రయోజనాలకు అనుగుణంగా వార్తలను ప్రసారం చేస్తున్నాయి. కాకపోతే ఆడవాళ్ల వ్యక్తిత్వాన్ని హననం చేసే బాధ్యతను మీడియాకు ఎవరిచ్చారనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More