TDP – Pawan : పవన్ వారాహి యాత్ర టీడీపీలో వణుకు పుట్టిస్తోందా? అంతా సవ్యంగా జరుగుతుందునుకుంటున్న తరుణంలో కథ అడ్డం తిరిగిందా? ఊహించని ఎదురుదెబ్బ ఆ పార్టీకి తగిలిందా? ఇదేంటి ఇలా జరుగుతోందన్న ఆందోళన ప్రారంభమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల తరువాత టీడీపీకి తగిలిన దెబ్బ అలాంటిది ఇలాంటిది కాదు. కోలుకోవడానికి సుమారు రెండేళ్లు పట్టింది. పార్టీ శ్రేణులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా ఇబ్బందిపడ్డాయి. అటు తరువాత పవన్ తో స్నేహంతో కొంత ధైర్యం వచ్చింది. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయం టానిక్ లా పనిచేసింది. అటు బీజేపీ సైతం టీడీపీ వైపు చూడడం ప్రారంభించింది. దీంతో ఇక తమది ఏకపక్ష విజయమేనన్న అభిప్రాయానికి టీడీపీ నేతలు వచ్చారు.
టీడీపీ, జనసేన, బీజేపీ అలయెన్స్ అయితే 130 సీట్లకుపైగా వస్తాయని తెలుగుదేశం పార్టీ అంచనా వేసుకుంటోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన శ్రేణులు సైతం సమన్వయం చేసుకోవడం ప్రారంభించాయి. బీజేపీ కేడర్ సైతం కలిసిపోయేందుకు మానసికంగా సిద్ధమైంది. సరిగ్గా ఇటువంటి తరుణంలో పవన్ టీడీపీకి ఢిఫెన్స్ లో పడేశారు. వారాహి యాత్రలో విభిన్నమైన ప్రకటనలు చేసి ఆ పార్టీ నోట్లో పచ్చి వెలక్కాయ పడేశారు. తనను మాత్రమే గెలిపించండి. తనకు మాత్రమే సీఎం చాన్సివ్వండి. మీ భరోసాకు జనసేన పూచీ అనేసరికి టీడీపీ లో వణుకు ప్రారంభమైంది. ఇక పొత్తులు ఉండవా అన్న సందేహంలో కేడర్ పడిపోయింది.
అటు బీజేపీ పెద్దలు సైతం పొత్తును ఫైనలైజ్ చేయలేదు. ఇంకా అవి ప్రాథమిక స్థాయిలో జరిగిన చర్చలే అన్నట్టు చంద్రబాబు ఉన్నారు. దానిపై స్పష్టమైన ప్రకటన చేయలేకపోతున్నారు. ఇటు వారాహి యాత్రలో పవన్ వైసీపీని టార్గెట్ చేసుకున్నా.. వణికిపోతోంది మాత్రం టీడీపీయే. ఎక్కడ పొత్తు పెటాకులవుతుందో? పవన్ చేజారిపోతారన్న భయం ఆ పార్టీని వెంటాడుతోంది. ఈ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న జనసేన కొద్దిగా తగ్గి వ్యవహరిస్తోంది. అధికార పార్టీ సైలెంట్ కావడం, బీజేపీ నుంచి సంకేతాలు నిలిచిపోవడం, పవన్ స్వరం మారడం వంటి పరిణామాలతో పసుపు దళం మల్లగుల్లాలు పడుతోంది.
అయితే పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండడంపై టీడీపీలో అనుమానాలు పెరుగుతున్నాయి. కానీ ఇది పొత్తుకు విఘాతం కలిగించే అంశం కాదని భావిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 స్థానాల్లో వైసీపీ గెలవనివ్వనని అనడాన్ని గుర్తుచేస్తోంది. ఆ 34 నియోజకవర్గాల్లో జనసేన మాత్రమే గెలుస్తుందని చెప్పలేదని.. వైసీపీ ఓడిపోతుందని మాత్రమే చెప్పారని ఉదహరిస్తోంది. అంటే ఇంకా పొత్తుల అంశాన్ని పవన్ సజీవంగా ఉంచారని భావిస్తోంది. అయితే లోలోపల మాత్రం టీడీపీ శ్రేణులకు అంతులేని భయం వెంటాడుతోంది. ఉన్నపళంగా తమను పవన్ వదిలేస్తారని సగటు టీడీపీ అభిమాని తెగ భయపడుతున్నారు.