Telangana TDP: తెలంగాణ తెలుగుదేశం( Telugu Desam) పార్టీని చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు? అక్కడ కొద్దిపాటి నాయకత్వంతో పాటు క్యాడర్ ఉంది. కానీ చంద్రబాబు మాత్రం అక్కడ పార్టీని క్రియాశీలకం చేయడం లేదు. అయితే దీనిపై రకరకాల చర్చ నడుస్తోంది. తాజాగా పంచాయతీ ఎన్నికలను పట్టించుకోలేదు టిడిపి. కానీ టిడిపికి మద్దతుదారులు ఒక 20 మంది సర్పంచులుగా గెలిచారు. ఉమ్మడి ఖమ్మం తో పాటు మహబూబ్నగర్ జిల్లాలో ప్రభావం చూపారు. కనీసం ఎన్నికల బరిలో లేదు టిడిపి. అయినా సరే పర్వాలేదు అనిపించే స్థానాలు దక్కించుకుంది. ఉనికి చాటుకుంది. దీంతో తెలంగాణలో టిడిపి యాక్టివ్ అవుతుందా? అనే చర్చ మొదలయింది. అయితే అక్కడ నాయకత్వం మాత్రం పార్టీ యాక్టివ్ కావాలని కోరుతోంది. కానీ నాయకత్వం నుంచి ఆ స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. కనీసం పంచాయితీ ఎన్నికలతోనైనా నాయకత్వంలో మార్పు వస్తుంది అని ఆశిస్తున్నారు తెలంగాణ టిడిపి నేతలు.
* విభజన వరకు బలంగానే..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో( Telangana) బలమైన నాయకత్వంతో పాటు క్యాడర్ కూడా ఉండేది. అయితే తెలుగుదేశం పార్టీ పరిస్థితిని పసిగట్టారు కెసిఆర్. ఆ పార్టీని దెబ్బతీస్తే కానీ రాజకీయంగా తన పార్టీ బలపడదని భావించారు. దీనికి తోడు అధికారం చేతికి రావడంతో సామవేద దండోపాయాలను ప్రయోగించారు. అంతకుముందే తెలంగాణ సమాజానికి చంద్రబాబును ఒక బూచిగా చూపించారు. తెలంగాణ వ్యతిరేక ముద్ర వేయడంలో సక్సెస్ అయ్యారు. క్రమేపి టిడిపి బలహీనం కావడం ప్రారంభించింది. నాయకులతోపాటు క్యాడర్ సైతం యూటర్న్ తీసుకుంది. 2018 ఎన్నికలకు వచ్చేసరికి మరింత పరిస్థితి మారింది. ఒకవైపు ఎన్డీఏ దూరం కాగా.. ఇంకోవైపు జగన్, ఆయనకు సహకారంగా కెసిఆర్ రంగంలోకి దిగడంతో చంద్రబాబు ఏకాకి అయ్యారు. ఏపీలో అధికారానికి దూరం కావడం తెలంగాణపై ప్రభావం చూపింది.
* నాయకుడు లేని పార్టీగా..
ప్రస్తుతం తెలంగాణలో టిడిపికి అధ్యక్షుడు లేరు. ఓ పదిమంది వరకు నాయకులు ఉన్నారు. గతంలో గ్రేటర్లో పార్టీకి పట్టు ఉండేది. ఆ పై ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో మంచి క్యాడర్ కొనసాగేది. 2023 ఎన్నికల సమయానికి ఆ పార్టీని బలోపేతం చేస్తానని చంద్రబాబు అనుకున్నారు. అందుకే బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించారు. కానీ ఏపీలో అరెస్టు కావడంతో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు చంద్రబాబు. అందుకే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావించారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాసాని జ్ఞానేశ్వర్ పార్టీని విడిచిపెట్టారు. ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో చిన్నపాటి ఊపు వచ్చింది. కానీ ఆయన గుడ్ బై చెప్పడంతో పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. అయితే వరుసగా వస్తున్న ఎన్నికల్లో టిడిపి వైపు అన్ని పార్టీలు చూస్తున్నాయి. అయితే టిడిపికి ఉన్న క్యాడర్ వల్లే అలా చేస్తున్నాయి. ఇప్పుడు అదే క్యాడర్ స్వచ్ఛందంగా పోటీ చేసి 20 పంచాయితీలను కైవసం చేసుకోవడం నిజంగా గొప్ప విషయమే. తద్వారా తెలంగాణలో ఏదో ఒక నిర్ణయానికి రావాలన్న సంకేతం అయితే టిడిపి నాయకత్వానికి వచ్చింది. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.