TDP+Janasena – BJP Alliance : ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. బీజేపీతో కలిసి నడిచి జగన్ సర్కారు గద్దె దించాలని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. కాషాయదళంతో కూటమి కట్టి వైసీపీకి మట్టి కరిపించాలని భావిస్తున్నారు. అటు పవన్ సైతం అదే వైఖరితో బీజేపీ హైకమాండ్ తో చర్చలు జరిపారు. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందనుకుంటున్న తరుణంలో ఢిల్లీ నుంచి భిన్నమైన సంకేతాలు వెలువడుతున్నాయి. జగన్ ను ఇంటికి పంపిద్దామని చంద్రబాబు, పవన్ భావిస్తుంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే రూపం వస్తున్న కూటమికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి.
రాష్ట్రంలో అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించడం లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడం లేదు. ప్రజలు ఆశించిన అభివృద్ధి కనిపించడం లేదు. జగన్ కు పాలనా పరంగా ఆర్థిక నిర్వహణ ప్రధాన సమస్యగా మారుతోంది. ఎన్నికల ఏడాది కావటంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే పెండింగ్ హామీలు..బిల్లుల విడుదల చేయాల్సి ఉంది. ఇవన్నీ ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయి. దీంతో జగన్ కేంద్ర సాయాన్ని అర్ధించారు. ప్రధాని మోదీతో సీఎం జగన్ పలు మార్లు చర్చలు జరిపారు. ఏపీకి అండగా నిలవాలని కోరారు. అదే సమయంలో జగన్ సర్కారు రాష్ట్ర భవిష్యత్ ను అంధకారంలో నెట్టిందని విపక్షాలు ఆరోపించాయి. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదించాయి. అయితే వాటిని పట్టించుకోని మోదీ .. జగన్ కు సాయం చేసేందుకే మొగ్గుచూపారు. ఆయన అభ్యర్థనలన్నింటికీ ఆమోద ముద్ర వేశారు.
ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్ర ఖజనా ఖాళీ, పొత్తులతో బీజేపీ వైఖరిలో మార్పు తదితర కారణాలతో జగన్ సర్కారుకు సాయం అందదని విపక్షాలు భావించాయి. ఉద్యోగుల బకాయిలు..కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు, నిర్వహణ ఖర్చుల భారంగా పరిణమిస్తాయని అంచనా వేశారు. జగన్ ప్రభుత్వం పైన రాజకీయంగా దాడిని పెంచారు. ఎన్నికల సమయంలోనూ కేంద్రంలోని ముఖ్యుల నుంచి మేనేజ్ మెంట్ లో సాయం లేకుండా చూడాలని భావించారు. చంద్రబాబు – పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా రావటంతో పవన్ ప్రతిపాదన పైన బీజేపీ సానుకూలంగా స్పందిస్తుందనే అంచనాలు పెరిగాయి. కానీ అందుకు విరుద్ధంగా పరిస్థితులు తలెత్తుతున్నాయి. జగన్ కు మోదీ సర్కారు ఇతోధికంగా సాయపడుతోంది. దీంతో బీజేపీ అధికారికంగా నిర్ణయం ప్రకటించే వరకూ చంద్రబాబు – పవన్ వేచి చూస్తారా లేక, ఈ రెండు పార్టీలే పొత్తును అధికారికంగా ప్రకటిస్తాయా అన్న దానిపై కొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది.