Nominated posts : ఏపీలో నామినేటెడ్ పదవులను ప్రకటించారు. దాదాపు 20 కార్పొరేషన్లకు చైర్మన్ లను, సభ్యులను నియమించారు. ఎన్నికల్లో కూటమి కోసం పని చేసిన నేతలకు ఛాన్స్ దక్కింది. రెండు కార్పొరేషన్లను జనసేనకు కేటాయించారు. ఒక కార్పొరేషన్ అధ్యక్ష పదవి బిజెపికి ఇచ్చారు. అంతవరకు ఓకే కానీ.. టిడిపి వాయిస్ వినిపించిన చాలామంది సీనియర్లకు చోటు దక్కలేదు. దీంతో వారిలో ఒక రకమైన అసంతృప్తి రగులుతోంది. మరోవైపు కొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు ఇచ్చారు. కానీ వారి కంటే జూనియర్లుగా ఉన్న వారికి అధ్యక్ష పదవులు కట్టబెట్టారు. దీంతో తాము వారి కింద పని చేయాలా? అంటూ ఎక్కువమంది పదవులు తీసుకునేందుకు విముఖత చూపుతున్నారు. తమ స్థాయికి తగ్గ పదవులు కాదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి బాగా కనిపిస్తోంది. అయితే ఏపీలో మూడు పార్టీల కూటమి ఉన్న నేపథ్యంలో.. పదవుల సర్దుబాటు అంత ఈజీ కాదని.. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని హై కమాండ్ బుజ్జగిస్తోంది. అయితే భారీ పదవులపై ఆశలు పెట్టుకున్న కొందరు నేతలు నీరుగారిపోయారు. పదవులు స్వీకరించేందుకు ముందుకు రావడం లేదు.
* ఎన్నికల్లో దేవినేని ఉమా టికెట్ త్యాగం చేశారు. వైసీపీ నుంచి టిడిపిలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కోసం పక్కకు తప్పుకున్నారు ఉమా. ఆయనకు రాష్ట్రస్థాయి పదవి ఖాయమని ప్రచారం సాగింది. ముఖ్యంగా ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని టాక్ నడిచింది. కానీ ఆయన పేరును ప్రకటించలేదు. ఆ పదవిని కొనకల్ల నారాయణకు కేటాయించారు.
* ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిడిపి వాయిస్ ని వినిపించిన నేతలు పట్టాభి ఒకరు. ఆయన చేసిన కామెంట్స్ చాలా సార్లు వైరల్ అయ్యాయి. వివాదాస్పదంగా మారాయి. ఎన్నికల్లో ఆయన టిక్కెట్ ఆశించారు. కానీ దక్కలేదు. నామినేటెడ్ పోస్ట్ కేటాయిస్తారని ప్రచారం సాగింది. ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఆయనకు ఛాన్స్ దక్కుతుందని అంతా భావించారు. కానీ ఈయన కూడా ప్రకటించలేదు.
* ఆనం వెంకటరమణారెడ్డి సైతం పదవి ఖాయమని ప్రచారం సాగింది. పార్టీ వాయిస్ ని వినిపించడంలో వెంకటరమణారెడ్డి ది వినూత్న శైలి. ఆయన కామెడీగా చెప్పిన మాటలు వైరల్ అవుతాయి. ఎన్నికల్లో టికెట్ ఆశించారు. దక్కకపోయేసరికి నామినేటెడ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయనకు ప్రకటించలేదు.
* జీవి రెడ్డి సైతం పార్టీ వాయిస్ ను బలంగా వినిపించారు. టిడిపి కష్టకాలంలో ఉండగా పార్టీలో జాయిన్ అయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే ఇతర పార్టీల నుంచి నేతల చేరికకు కారణమయ్యారు. ఎన్నికల్లో టికెట్ ఆశించారు. దక్కకపోయేసరికి నామినేటెడ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయినా సరే ఈ జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు.
* ఇంకా పదవులు పెండింగ్
ప్రస్తుతం 20 శాతం నామినేటెడ్ పోస్టులను మాత్రమే సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇంకా వందలాది దేవస్థానాలు, కీలక కార్పొరేషన్లు, దిగువ స్థాయి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. వీటికి తోడు కూటమికి పెద్ద ఎత్తున రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు దక్కే అవకాశం ఉంది. అందుకే సీనియర్లకు నామినేటెడ్ పోస్టుల జాబితాలో చోటు దక్కలేదని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. చాలామందికి బిగ్ ఆఫర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మూడు పార్టీల మధ్య పొత్తు ఉన్న నేపథ్యంలో.. తమకు పదవులు దక్కుతాయా? లేదా? అన్న ఆందోళనలో టిడిపి నాయకులు ఉన్నారు.