TDP Janasena First List: శనివారం జనసేన, టిడిపి కూటమి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగానే ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రెండవ విడతలో మిగతా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని కూటమి ప్రకటించిన నేపథ్యంలో.. జగన్ ఎవరికి సీట్లు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. జగన్మోహన్ రెడ్డి సామాజిక లెక్కలే ఆధారంగా పార్టీ ఇన్ ఛార్జ్ లను మార్చారు. ఇక్కడ వాళ్లను అక్కడికి, అక్కడ వాళ్లను ఇక్కడికి స్థానభ్రంశం చెందించారు.. ఈ నేపథ్యంలో జనసేన, టిడిపి కూటమి అభ్యర్థులు జగన్ సమీకరణాలను ఏ విధంగా ప్రభావితం చేస్తారనే చర్చ మొదలైంది.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీట్ల కేటాయింపులో జగన్ బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రకటించిన 99 మంది అభ్యర్థుల్లో 86 మంది పురుషులు ఉన్నారు. 13 మంది మహిళలున్నారు. తొలి జాబితాలో సీనియర్లకు టికెట్లు కేటాయించకపోవడంతో.. మలి జాబితాలో వారికి ఏ స్థానాలు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కూటమి సామాజిక కసరత్తు కూడా జగన్మోహన్ రెడ్డికి ధీటు గానే ఉన్నట్టు కనిపిస్తోంది. బీసీలకు 20 సీట్లు, ఎస్సీలకు 20 స్థానాలు, ఎస్టీల కు 3, కాపులకు 10, కమ్మ వర్గం వారికి 21, వైశ్యులకు రెండు, క్షత్రియ వర్గానికి నాలుగు, వెలమలకు ఒకటి స్థానాన్ని కేటాయించారు. మైనారిటీలకు టిడిపి కేవలం నంద్యాల సీటు మాత్రమే కేటాయించింది.
అయితే ఈ సీట్ల కేటాయింపుతో వైసిపి అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. వచ్చే నెల మూడున అద్దంకిలో జరిగే సిద్ధం సభ తర్వాత పార్టీ అభ్యర్థులను, మేనిఫెస్టో జగన్ ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే టిడిపిలో టికెట్లు దక్కని వారు తమ వైపు చూస్తారని వైసీపీ భావిస్తోంది. అవసరమైతే పార్టీ ఇన్ ఛార్జ్ లను కూడా మార్చే అవకాశం ఉంటుందని సంకేతాలు ఇస్తోంది.. ఇక తొలి జాబితాలో పవన్ తాను పోటీ చేసే స్థానం గురించి స్పష్టంగా చెప్పలేదు. జనసేన కేవలం 24 స్థానాలకు పరిమితం కావడంతో వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. కాపు సంఘం నాయకులు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి లేఖలు సంధిస్తున్నారు.