AP Elections 2024: ఏపీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రచారం పతాక స్థాయికి చేరింది. నామినేషన్ల పర్వం సైతం నడుస్తోంది. అన్ని పార్టీల అభ్యర్థులు బలప్రదర్శనకు దిగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జనాలకు మంచి డిమాండ్. భారీగా ప్రలోభాల ఎర నడుస్తోంది. ముందు రోజు ఒక పార్టీ ర్యాలీలో కనిపించే వాహనాలు.. తరువాత రోజు ఇంకో పార్టీర్యాలీలో కనిపిస్తున్నాయి.అవే నంబర్లతో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. దీంతో ఇదేమి పార్టీలు? ఇదేమి కూటమి కట్టడాలు? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ నడుస్తోంది.
వైసిపి ఒంటరి పోరు చేస్తున్న సంగతి తెలిసిందే.మరోవైపు టిడిపి,జనసేన, బిజెపి కూటమి కట్టాయి. ప్రస్తుతం కూటమి వెర్సెస్ వైసీపీ అన్నంత రేంజ్ లో ప్రచారం నడుస్తోంది. ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియా విందులు పెద్ద ఎత్తున ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాయి. అవి వైరల్ గా మారుతున్నాయి. ఓ ర్యాలీలో ద్విచక్ర వాహనంపై పవన్ బొమ్మ ఉంటుంది. కానీ వాహనానికి వైసీపీ జెండా ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఇది పవన్ పరిస్థితి? కూటమి పరిస్థితి?అంటూ ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. పవన్ అభిమానులు అంటే ఎలా ఉంటారు అంటూ ట్రోల్ చేశాడు. దీనిపై భిన్న కామెంట్స్ వస్తున్నాయి.
వైసిపి ప్రలోభాల పర్వం కొనసాగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. క్వార్టర్ మద్యం, బిరియాని, రెండు లీటర్ల పెట్రోల్ అంటూ టిడిపి, జనసేన, బిజెపి శ్రేణులు కామెంట్స్ చేస్తుండగా.. పవన్ ను అభిమానిస్తాడు.. జగన్ కు ఓటు వేస్తాడు.. ఇది జన సైనిక్ పరిస్థితి అంటూ వైసీపీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నాయి. అయితేసోషల్ మీడియాలో నిజమైన ఫోటోలు పెడుతున్నారో? లేకుంటే ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేసేందుకు పెడుతున్నారో? మాత్రం అర్థం కావడం లేదు.