Kodali Naani : టార్గెట్ కొడాలి నాని.. తెరపైకి గుడివాడ కెసినో.. అనుచరులపై వరుస కేసులు!

కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. పాలనతో పాటు గత వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతోంది. పనిలో పనిగా పాత కేసులను తిరగదోడుతోంది.

Written By: Dharma, Updated On : August 12, 2024 12:29 pm

Kodali Naani

Follow us on

Kodali Naani : కొడాలి నాని పై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందా? ఆయన చుట్టూ ఉచ్చు బిగించాలని చూస్తోందా? పాత కేసులను తిరగదోడుతోందా? అందులో భాగంగానే అనుచరులపై కేసులా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఐదేళ్లుగా కొడాలి నాని గుడివాడలో టిడిపి శ్రేణులను వెంటాడారు. టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని, లేకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని కూడా సవాల్ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో కొడాలి నాని ఓడిపోయారు. నాని పై ఎన్నారై వెనిగండ్ల రాముని ప్రయోగించారు చంద్రబాబు. కొడాలి నాని దారుణంగా ఓడిపోయారు. గుడివాడలో ముఖం చూపించడం మానేశారు. ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మొన్న ఆ మధ్యన అనారోగ్యానికి గురైనట్లు టాక్ నడిచింది. అయితే తాజాగా కొడాలి నాని పై ఉన్న పాత కేసులను తిరగదోడే పనిలో పడ్డారు పోలీసులు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడులకు సంబంధించి పలు సెక్షన్లతో కొడాలి నాని అనుచరులపై కేసులు నమోదు చేశారు. మరోవైపు గుడివాడ కెసినో వ్యవహారంపై కూడా దృష్టి పెట్టారు. అప్పట్లో నిజ నిర్ధారణకు వెళ్లిన టిడిపి శ్రేణులపై కొడాలి నాని అనుచరులు వెంటాడి వేటాడి దాడి చేశారు. అప్పుడు వారిపై కేసులు నమోదు చేయకుండా పోలీసులు.. తిరిగి టిడిపి నేతలపైనే వేశారు.అందుకే నాటి ఘటనలకు సంబంధించిపూర్తి ఆధారాలతోకొడాలి నాని అనుచరులపై కేసు నమోదు చేసి అరెస్టులు ప్రారంభించారు.

* తెరపైకి కెసినో వ్యవహారం
2022 జనవరి 21న కొడాలి నాని కెసినో వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణకు గుడివాడ వెళ్ళింది. అప్పట్లో అలా వెళ్లిన టిడిపి నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. గుడివాడ టిడిపి కార్యాలయం పై దాడి చేయడంతో పాటు ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అయితే అప్పట్లో దాడి చేసిన వైసిపి కార్యకర్తలపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. తిరిగి టిడిపి శ్రేణులపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు అదే ఘటనకు సంబంధించి వైసీపీ సీనియర్ నేత దుక్కిపాటి భూషణ్, కొడాలి నాని అనుచరులపై కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

* టిడిపి కార్యాలయం పై దాడి
2022లో టిడిపి ఇన్చార్జిగా మాజీ మంత్రి రావి వెంకటేశ్వరరావు ఉండేవారు. అదే ఏడాది డిసెంబర్ 25న తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి జరిగింది. రావి వెంకటేశ్వరరావు తో పాటు టిడిపి నేతలపై విధ్వంసానికి దిగారు వైసీపీ శ్రేణులు. కొడాలి నాని గుడివాడలో ఉండి వైసిపి శ్రేణులను పంపించారన్నది టిడిపి నేతల ఆరోపణ. అప్పట్లో ఫిర్యాదు చేసినా పోలీసులు దృష్టి సారించలేదు. ఇప్పుడు తాజాగా దృష్టి పెట్టినట్లు సమాచారం. అప్పటి వీడియో ఫుటేజ్ ఆధారంగా కొడాలి నాని అనుచరులు మెరుగుమాల కాళీ, నీరుడు ప్రసాద్ తో పాటు మరో 20 మందిపై కేసులు నమోదు చేశారు. అవసరమైతే వీరందరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

*:ఆ ఇద్దరి నేతల అరెస్టుకు ప్రయత్నం
ఇప్పటికే వల్లభనేని వంశీ మోహన్ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంతవరకు వల్లభనేని వంశీ ఆచూకీ దొరకలేదు. ఇప్పుడు కొడాలి నాని పై దృష్టి పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరూ గతంలో టిడిపి అధినేత తో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారే. దీంతో వీరిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదని టిడిపి నేతలు భావిస్తున్నారు. కేసుల భయంతోనే ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.