Chandrababu: ఏడుపదుల వయసులో చంద్రబాబు కష్టపడుతున్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండడానికి డిసైడ్ అయ్యారు. వరుస కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికలు టిడిపికి జీవన్మరణ సమస్యలాంటివి. అందుకే చంద్రబాబు ఏ చిన్న ప్రయత్నాన్ని విడిచిపెట్టడం లేదు. జనసేన తో పొత్తు పెట్టుకున్నారు. బిజెపిని సైతం ప్రసన్నం చేసుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. ఇవన్నీ కొలిక్కి రావడంతో ఇప్పుడు ప్రజలను ఒప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల సభలు భారీగా నిర్వహించడానికి డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా వైసీపీకి బలం ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకొని చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారు. అటు జనసేన అధినేత పవన్ తో పాటు చంద్రబాబు వేదికలు పంచుకోనున్నారు. బిజెపి కూటమిలోకి వస్తే నేతలు సైతం హాజరయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే చంద్రబాబు రా కదలిరా పేరుతో 25 పార్లమెంటు స్థానాల్లో సభలను నిర్వహిస్తూ వచ్చారు. ఈనెల 4న రాప్తాడులో జరిగే రా కదలిరా సభలతో ముగించనున్నారు. మార్చి 6 నుంచి ప్రజాగలం పేరుతో కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. వరుసగా ఐదు రోజుల పాటు ప్రజాగళం కార్యక్రమాలు కొనసాగనున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలలో తొలిరోజు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం మైదుకూరులో జరగనుంది. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చే విధంగా ప్లాన్ చేశారు. భారీ జన సమీకరణకు నిర్ణయించారు. జనసేన పార్టీ శ్రేణులను సైతం భాగస్వామ్యం చేయనున్నారు. ఇప్పటికే 25 పార్లమెంటు స్థానాల పరిధిలో రా కదలిరా సభలు సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యాయి. అవి పూర్తి కావడంతో ఈ కొత్త కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు.
కొద్ది రోజుల కిందట తాడేపల్లిగూడెంలో జనసేనతో కలిసి నిర్వహించిన జెండా సభ విజయవంతమైంది. రెండు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అదే ఉత్సాహాన్ని ఎన్నికల వరకు కార్యకర్తల్లో ఉండేలా నిరంతరం ఏదో ఒక కార్యక్రమంతో జనాల్లోకి వెళ్లాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా జనసేన తో కలిసి భారీ బహిరంగ సభలను కొనసాగించాలని భావిస్తున్నారు. మరోవైపు బిజెపితో పొత్తు విషయంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టమైన ప్రకటన రానుంది. బిజెపి వస్తే ఆ పార్టీ అగ్రనేతలతో చంద్రబాబు వేదిక పంచుకునే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వరుస పర్యటనలకు చంద్రబాబు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే ప్రజా గళం ప్రజా బలంగా మారనుందని.. టిడిపికి మరింత బలం పెరగనుందని ఆ పార్టీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. మరి ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.