TDP Counterfeit Alcohol : ఏపీ( Andhra Pradesh) రాజకీయాల్లో మరో సంచలనం. అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం కలకలం సృష్టించింది. అటు తిరిగి ఇటు తిరిగి అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ఈ వ్యవహారం వెనుక ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జ్ దాసరిపల్లి జయ చంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడు లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ వ్యవహారంలో వారి పాత్ర పై విచారణ చేయాలని నిర్ణయించినట్లు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు నకిలీ మద్యం వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. దీంతో ఈ అంశంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
* అధికారుల తనిఖీలతో..
ఇటీవల ములకలచెరువులో ఎక్సైజ్ శాఖ తనిఖీలు జరిపింది. కొంతమంది మద్యం బాటిల్లతో పట్టుబడ్డారు. వారిచ్చిన సమాచారంతో ములకలచెరువులో విస్తృతంగా తనిఖీలు చేశారు. అక్కడ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఒకటి వెలుగు చూసింది. మొత్తం 14 మందిని గుర్తించి.. పదిమందిని అరెస్టు చేశారు. ఫేక్ లేబుల్స్ తో పాటు వివిధ బ్రాండ్ల నకిలీ మద్యం పార్టీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి ఏ 1 గా ఉన్నారు. అతనికి విజయవాడలో ఒక బార్ లైసెన్స్ ఉంది. నకిలీ మద్యం దందాకు గాను ములకలచెరువుకు వచ్చాడు. అయితే ఈ బృందంలో తమిళనాడుకు చెందిన నలుగురు, ఒడిస్సా కు చెందిన వారిని ఒకరిని నియమించుకున్నట్లు ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో వెల్లడయింది.
* ఆరోపణలు రావడంతో..
ములకలచెరువులో నకిలీ మద్యం తయారు చేసి మిగతా ప్రాంతాల్లో చలామణి చేస్తున్నారు. ప్రస్తుతం ఏ 1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు విదేశాల్లో ఉన్నాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జ్ జయ చంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడుల పేర్లు బలంగా వినిపించాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. తక్షణం వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రచార అస్త్రంగా మారే అవకాశం ఉంది. ప్రతి మూడు మద్యం సీసాలలో ఒకటి నకిలీ అవుతోందని.. అధికార పార్టీకి మద్యం కాసులు కురిపిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. చూడాలి ఈ వివాదం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో..