KCR to Errannaidu : తెలుగునాట రాజకీయ ముఖ చిత్రం మార్చిన ఘనత ఎన్టీ రామారావుదే. టీడీపీ కాంపౌండ్ వాల్ నుంచి వందలాది మంది నాయకులు పుట్టుకొచ్చారు. నాయకులను తయారుచేసే ఫ్యాక్టరీ టీడీపీ అన్న నినాదం చాలావరకూ వాస్తవం. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు అక్కడి కేబినెట్ లో ఉన్నవారి పూర్వశ్రామం టీడీపీనే. టీడీపీ ఆవిర్భావానికి ముందు బీసీ వర్గాలకు రాజకీయ గుర్తింపు అంతంతమాత్రం. అధికారమంతా మెజార్టీ సామాజికవర్గాల చేతిలో ఉండేది. దానిని బడుగు, బలహీనవర్గాల వ్యాపితం చేసింది మాత్రం ముమ్మాటికీ ఎన్టీఆరే. కింజరాపు ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కిమిడి కళా వెంకట్రావు, ఎల్.రమణ వంటి నేతలు టీడీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన వారు.
1983 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన వారిలో ఎక్కువ మందికి పట్టుమని మూడు పదుల వయసు కూడా ఉండదు. గత 40 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతూ, ఆయా జిల్లాల్లో గట్టి నేతలుగా నిలిచారు. 1987లో కొత్తగా మండల వ్యవస్థను ఏర్పాటు చేసినపుడు ఆ ఎన్నికల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించారు. దీంతో మొదటిసారి పెద్ద సంఖ్యలో మహిళలు ఎంపీపీలు, జడ్పీ చైర్‌పర్సన్లు అయ్యారు. ఆ రోజుల్లో ఎంపీపీలుగా పనిచేసిన చాలామంది బీసీ నేతలు ఆ తర్వాతి కాలంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కాగలిగారు. అంచెలంచెలుగా ఎదుగుతూ మంత్రులుగా పదవులు దక్కించుకున్న వారూ ఉన్నారు.
సాధారణ కుటుంబాల నుంచి ఎన్టీఆర్ విధానాలకు ఆకర్షితులైన వారు ఉన్నారు. టీడీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన నవ యువకులు తరువాత సామాన్యులుగా ఎదిగారు. పార్టీతో నాయకత్వ పటిమను పెంచుకొని సొంత అస్తిత్వాన్ని పొందారు. బలమైన నాయకులుగా తమను తాము తీర్చిదిద్దుకున్నారు. ఇందులో ముందు వరుసలో ఉండేది తెలంగాణ సీఎం కల్వకుంట చంద్రశేఖరరావు, దివంగత బాలయోగి, ఎర్రన్నాయుడులు. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న కేసీఆర్ 1982లో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 1983 ఎన్నికల్లో ఓటమి చవిచూసినా.. 1989 ఎన్నికల్లో విజయం అందుకున్నారు. 1999 వరకూ వరుసగా నాలుగు ఎన్నికల్లో విజయం సాధించారు. టీడీపీతో విభేదించి టీఆర్ఎస్ ను స్థాపించారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తెలంగాణ రాష్ట్ర సాధన క్రెడిట్ దక్కించుకున్నారు. తెలంగాణకు వరుసగా రెండోసారి సీఎం అయ్యారు.
లోక్ సభ తొలి దళిత స్పీకర్ గా టీడీపీ ఎంపీ జీఎంసీ బాలయోగి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. కాకినాడలో లా ప్రాక్టీస్ చేస్తున్న బాలయోగి ఎన్టీఆర్ విధానాలకు ఆకర్షితులయ్యారు. టీడీపీలో చేరారు. 1987 జిల్లా పరిషత్ ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ గా గెలుపొందారు. 1991లో ఎంపీగా పోటీచేసి గెలిచారు. 1996లో ఓటమి చవిచూసినా.. తరువాత అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. 1999లో ఎంపీ అయినా ఆయనకు లోక్ సభ స్పీకర్ గా పదవి దక్కింది.
ఎర్రన్నాయుడు అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలోనే ఎన్టీఆర్ విధానాలకు ఆకర్షితులై 1982లో ఆ పార్టీలో చేరారు. 1983లో హరిశ్చంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. 1999 నుంచి ఎంపీగా ఎన్నికవుతూ హ్యట్రిక్ కొట్టారు. పార్లమెంటరీ నేతగా, కేంద్ర మంత్రిగా పదవులు చేపట్టారు. ప్రస్తుతం ఆయన సోదరుడుఅచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. కుమారుడు రామ్మోహన్ నాయుడు ఎంపీగా పదవీ బాధ్యతలు చేపడుతున్నారు. కుమార్తె ఆదిరెడ్డి భవాని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
టీడీపీ నుంచి అరంగేట్రం చేసిన వారిలో జానారెడ్డి, మాధవరెడ్డి, సత్యనారాయణరెడ్డి, దేవేందర్ గౌడ్, యనమల రామక్రిష్ణుడు, ఆనందగజపతిరాజు, అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కళా వెంకటరావు, గుండ అప్పలసూర్యనారాయణ, పతివాడ నారాయణస్వామినాయుడు, చిక్కాల రామచంద్రారావు, లాల్ జాన్ భాష, కేఈ కృష్ణమూర్తి, గాలి ముద్దు క్రిష్ణమనాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అప్పయ్యదొర, గౌతు శ్యామసుందర శివాజీ, తులసిరెడ్డి, రామచంద్రరెడ్డి, మొత్కుపల్లి నరసింహులు, ప్రతిబాభారతి..ఇలా చెప్పుకుంటూ పోతే చాంతడంత ఉంది.