Chandrababu – BJP : చంద్రబాబు సంకేతాలకు.. బీజేపీ నో రియాక్షన్

ప్రధాని మోదీ, బీజేపీతో దూరమైనందుకు లోలోపల తెగ నలిగిపోయినట్టు చెప్పుకొచ్చారు. ఏదో బాధలో బీజేపీ బంధాన్ని తెంచుకున్నాను కానీ.. నా మనసెప్పుడు కాషాయదళానికి దగ్గరగా ఉంటుందని సంకేతాలిచ్చారు.

Written By: Dharma, Updated On : April 26, 2023 6:17 pm
Follow us on

Chandrababu – BJP : చంద్రబాబు తన మనసులో ఉన్న బాధనంతా బయటపెట్టారు. గత నాలుగేళ్లుగా తనలో తాను కుమిలిపోతూ వస్తున్న ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీతో దూరమైనందుకు లోలోపల తెగ నలిగిపోయినట్టు చెప్పుకొచ్చారు. ఏదో బాధలో బీజేపీ బంధాన్ని తెంచుకున్నాను కానీ.. నా మనసెప్పుడు కాషాయదళానికి దగ్గరగా ఉంటుందని సంకేతాలిచ్చారు. బీజేపీ కలుపుకొని వెళ్లకపోయినా.. తాను మాత్రం బీజేపీ వెంటే ఉంటానని కుండబద్దలు కొట్టారు. ఓ జాతీయ మీడియా చర్చాగోష్టిలో పాల్లొన్న చంద్రబాబు తన మనసులో ఉన్న భావాలను వ్యక్తపరిచారు. దాదాపు కార్యక్రమం అంతా బీజేపీ, ప్రధాని మోదీ ప్రస్తావనతోనే చంద్రబాబు గడిపేశారు. ఎన్టీఏకు తాను దూరం కావడం దురదృష్టమని.. ఇప్పుడు దగ్గర కావడం అనేది కాలమే నిర్ణయిస్తుందని వైరాగ్యం మాటలు అనేశారు.

వైసీపీ ట్రాప్ లో పడి..
గత ఎన్నికలకు ముందు చంద్రబాబు వైసీపీ ట్రాప్ లో పడి ఎన్డీఏ ను చేజేతులా దూరం చేసుకున్నారు. అనవసరంగా బయటకు వచ్చారు. వస్తూ వస్తూ ప్రధాని మోదీని అనరాని మాటలు అనేశారు. ఆయనకు వ్యతిరేకంగా కూటమి కట్టారు. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చారు. సిద్ధాంతాలను పక్కనపెట్టి కాంగ్రెస్ తో దోస్తీ చేశారు. రాహూల్ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెడతానని పావులు కదిపారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. కనీసం రాష్ట్రంలో కూడా ఉనికి చాటుకునేందుకు ఆపసోపాలు పడ్డారు. జాతీయ స్థాయిలో నవ్వులపాలయ్యారు. సీన్ కట్ చేస్తే అదంతా బీజేపీకి దూరం చేసుకోవడం మూలంగానే నష్టం జరిగిందని గ్రహించారు. అప్పటి నుంచి బీజేపీ ప్రాపకం కోసం ప్రయత్నిస్తునే ఉన్నారు. కానీ గత అనుభవాల దృష్య్టా బీజేపీ మెత్తబడడం లేదు. రాష్ట్ర నేతలు కాదంటుండడంతో ఇప్పుడు చంద్రబాబు కేంద్ర పెద్దలను మొత్తబరిచే పనిలో పడ్డారు.

కుడి ఎడమలై…
ఎన్డీఏ నుంచి చంద్రబాబును దూరం చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు జగన్ బీజేపీకి దగ్గరయ్యారు. చంద్రబాబు పాత్రను పోషించడం ప్రారంభించారు. నాడు చంద్రబాబు చేసిన తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డారు. కేంద్ర పెద్దలతో స్నేహాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అదే కొనసాగితే 2024 లో తనకు ఇబ్బంది అవుతుందని చంద్రబాబుకు తెలుసు. అందుకే జరిగింది ఎలాగూ జరిగిపోయింది. ఇక జరగాల్సింది చూడండి అంటూ కేంద్ర పెద్దలకు సంకేతాలివ్వడం ప్రారంభించారు. ఏడు పదుల వయసులో ఇంతకంటే క్షమాపణ చెప్పలేనన్న దీన స్థితిలో వేడుకున్నారు. అందుకు ఓ జాతీయ మీడియా కార్యక్రమాన్ని వేదికగా మలుచుకున్నారు.

ఢిల్లీ వైపే అందరిచూపు..
అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ సైతం కేంద్ర పెద్దల ఎదుట కీలక ప్రాతిపాదనలు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. 2014 తరహాలో కూటమి కడితే అద్భుత విజయాలు సొంతం చేసుకోవచ్చని సూచించినట్టు టాక్ వినిపించింది. అందుకు తగ్గట్టుగానే తాను తగ్గానని.. గతంలో తప్పుచేశానని చంద్రబాబు పరోక్షంగా ఒప్పుకున్నట్టు అయ్యింది. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీయే. కానీ రాష్ట్ర నాయకులు మాత్రం ఎటువంటి ప్రతిపాదనలకు తలొగ్గేది లేదని చెబుతున్నారు. కానీ ప్రధాని మోదీ, అమిత్ షా నిర్ణయాలే ఫైనల్ కావడంతో వారి మాట గురించి అటు చంద్రబాబు, ఇటు రాష్ట్ర బీజేపీ నాయకులు ఆశగా ఎదురుచూస్తున్నారన్న మాట.