Tejovathi Araku president: తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని పాలించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సూపర్ విక్టరీ కొట్టింది. రిజర్వుడు నియోజకవర్గాలను సైతం సొంతం చేసుకుంది. గతంలో గెలుచుకొని స్థానాలను సైతం ఈసారి పొందింది. అయితే ఒక పార్లమెంట్ సీటు మాత్రం ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి అందని ద్రాక్షగా ఉంది. అదే అరకు పార్లమెంట్ స్థానం. దాదాపు మూడు జిల్లాలను కవర్ చేస్తూ ఉండే ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అందని ద్రాక్ష. అందుకే గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని బిజెపికి విడిచిపెట్టింది తెలుగుదేశం. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కొత్తపల్లి గీత. వైసీపీ అభ్యర్థి డాక్టర్ తనుజారాణి ఇక్కడ విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఏపీలో కూటమికి అధికారం దక్కడంతో టిడిపి తాడోపేడో తేల్చుకోవాలని చూస్తోంది. అందుకే ఓ మహిళ నేతను రంగంలోకి దించింది.
అరకు అధ్యక్షురాలిగా..
ఇటీవల తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా అధ్యక్షుల నియామకం చేపట్టింది టిడిపి. అందులో భాగంగా అరకు పార్లమెంటరీ నియోజకవర్గానికి మోజోరు తేజోవతి అనే మహిళ నేతను నియమించారు. ఉన్నత ఉద్యోగాన్ని విడిచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చారు తేజోవతి. గత ఎన్నికల్లో సాలూరు అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే అప్పటికే సీనియర్ నేతగా ఉన్న గుమ్మిడి సంధ్యారాణికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అక్కడ నుంచి ఆమె గెలవడం.. మంత్రి కావడం జరిగిపోయింది. అందుకే తేజోవతి సేవలను ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవాలని చంద్రబాబు ఆలోచన చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఆమె..
అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో తేజోవతిని నిలబెడతారని ప్రచారం ప్రారంభం అయింది.. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచి దశాబ్దాల కాలం అయింది. 2014లో సైతం ఇక్కడ వైసీపీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత పోటీ చేసి విజయం సాధించారు. కొద్ది రోజులకే ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారు. బిజెపిలోకి వెళ్లిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొడ్డేటి మాధవి పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల్లో సైతం వైసీపీ అభ్యర్థి తనుజారాణి విజయం సాధించారు. అయితే ఈసారి ఎలాగైనా ఆ స్థానాన్ని కొట్టాలన్న ఆలోచనలో టిడిపి ఉంది. అందుకే తేజోవతిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.