YS Jagan vs Nandamuri Balakrishna : జగన్ వర్సెస్ నందమూరి బాలకృష్ణ.. ఎవరి పంతం నెగ్గుతుంది.. రసకందాయంలో రాజకీయం

వారిద్దరూ ముఖ్యమంత్రుల కుమారులే. కానీ అందులో ఒకరు మాత్రమే సీఎం అయ్యారు. ఇంకొకరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ ఇద్దరి ప్రయాణం వేరు. ఈ క్రమంలో ఇప్పుడు నేరుగా తలబడుతున్నారు. గట్టిగానే దెబ్బ తీసుకోవాలని భావిస్తున్నారు.

Written By: Dharma, Updated On : October 11, 2024 6:17 pm

YS Jagan vs Nandamuri Balakrishna

Follow us on

YS Jagan vs Nandamuri Balakrishna : ఏపీలో కీలక నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తుండటమే అందుకు కారణం. వాస్తవానికి హిందూపురం నందమూరి కుటుంబానికి పెట్టని కోట. తొలుత ఉమ్మడి రాష్ట్రంలో నందమూరి తారక రామారావు హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచారు. అటు తరువాత ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ సైతం హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అనూహ్యంగా 2014లో నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఎంట్రీ ఇచ్చారు. టిడిపి అభ్యర్థిగా గెలిచారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం నిలిచారు. 2024 ఎన్నికల్లో తిరుగులేని విజయం సొంతం చేసుకున్నారు. అయితే గత ఐదేళ్ల వైసిపి పాలనలో హిందూపురంలో రాజకీయంగా బాలకృష్ణ ఇబ్బందులు పడ్డారు. దాదాపు టిడిపి స్థానిక సంస్థల ప్రతినిధులను వైసీపీలో చేర్పించారు అప్పటి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో బాలకృష్ణ అసెంబ్లీలో అడుగుపెట్టకూడదన్నది జగన్ లక్ష్యం. ఆ టాస్క్ ను పెద్దిరెడ్డికి ఇచ్చారు జగన్. గత ఐదేళ్ల కాలంలో ఎక్కువ రోజులు హిందూపురంలోనే గడిపారు పెద్దిరెడ్డి. ముఖ్యంగా హిందూపురం మున్సిపాలిటీ తో పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాలను వైసీపీ ఖాతాలో వేశారు పెద్దిరెడ్డి. అయితే ఇప్పుడు వైసీపీ అధికారానికి దూరమైంది. టిడిపి కూటమి విజయం సాధించింది. దీంతో వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు యూటర్న్ అవుతున్నారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.

* అప్పట్లో ఏకపక్ష విజయం
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా హిందూపురం మున్సిపాలిటీ వైసీపీ గెలుచుకుంది. 38 వార్డులకు గాను 30 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. టిడిపి అభ్యర్థులు ఆరు స్థానాలకు పరిమితం అయ్యారు. బిజెపి ఒకచోట, ఎంఐఎం మరోచోట గెలుపొందింది. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన ఇంద్రజ మున్సిపల్ చైర్ పర్సన్ అయ్యారు. మూడేళ్ల పాటు పదవీకాలం సజావుగా గడిచిపోయినా.. ఇప్పుడు కూటమి గెలిచేసరికి సీన్ మారింది. మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ తో పాటు మరో 11 మంది కౌన్సిలర్లు టిడిపి వైపు వచ్చారు. అటు చైర్ పర్సన్ ఇంద్రజ పదవికి రాజీనామా చేశారు. దీంతో వైసీపీ కౌన్సిలర్ల సహకారంతో టిడిపి నేత చైర్ పర్సన్ గా ఎంపికకు వ్యూహం కుదిరింది. అయితే సరిగ్గా ఇదే సమయంలో ఓ నలుగురు వైసీపీ కౌన్సిలర్లు తిరిగి మాతృ పార్టీలోకి వెళ్లిపోయారు. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ సీన్ మారింది.

* అటు నుంచి అటే రిసార్ట్స్ కు
ప్రస్తుతం హిందూపురం వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా మాజీమంత్రి ఉషశ్రీ చరణ్ ఉన్నారు. ఆమె చొరవ తీసుకోవడంతో ఆ నలుగురు కౌన్సిలర్లు తిరిగి మాతృ పార్టీలోకి వచ్చారు. వారిని అధినేత జగన్ వద్ద హాజరు పరిచారు. జగన్ వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో అతి త్వరలో హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎంపికకు నోటిఫికేషన్ వస్తుందని ప్రచారం సాగుతోంది. అయితే జగన్ తో సమావేశమైన వైసీపీ కౌన్సిలర్లు అటు నుంచి అటే రిసార్ట్స్ లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే బాలకృష్ణ రంగంలోకి దిగారు. అసలు ఆ వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలో ఎందుకు చేరారు? టిడిపి నుంచి తిరిగి ఎందుకు వెళ్లారు? అన్న దానిపై ఆరా తీస్తున్నారు. అదే సమయంలో రిసార్ట్స్ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. దీంతో జగన్ వర్సెస్ బాలకృష్ణ అన్న పరిస్థితి మారింది. మరి ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి.