AP Liquor Policy : ఏపీలో అనూహ్యంగా కొందరు మద్యం షాపులు దక్కించుకున్నారు. లక్కీ డ్రా లో షాపులు పొందిన వారు ఉన్నారు. చాలామంది వందలాది దరఖాస్తులు వేశారు. కానీ వారికి చుక్కెదురు అయింది. అదే సమయంలో ఈ వ్యాపారంతో సంబంధం లేని వారు లాటరీలో షాపులను సొంతం చేసుకున్నారు. అటువంటి వారిపై ఇప్పుడు ఒత్తిడి పెరుగుతోంది. సిండికేట్ లు రకరకాల ప్రలోభాలకు దిగుతున్నారు.బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. షాపు నిర్వహణకు 40 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది అని.. అదే షాపులు మాకు అప్పగిస్తే కోటి రూపాయల నుంచి..కోటి 20 లక్షల వరకు ఇస్తామని చెబుతున్నారు.అలాగే గుడ్ విల్ కింద నెలకు 15 వేల వరకు అందిస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో షాపులు దక్కించుకున్న వారిలో ఒక రకమైన ఆలోచన కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈనెల ఒకటి నుంచి ప్రైవేటు వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.ఈ మేరకు నిన్న లక్కీ లాటరీ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే ఈసారి ఈ వ్యాపారంతో సంబంధం లేని వారు సైతం పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. మరోవైపు సిండికేట్లు వందలాది దరఖాస్తులు దాఖలు చేశాయి. కానీ వారు అనుకున్న స్థాయిలో షాపులు దక్కలేదు.అయితే చాలామంది సామాన్యులకు ఈసారి లక్కీ లాటరీలో షాపులు వచ్చాయి. అటువంటి వారికి ఇప్పుడు ప్రలోభ పెడుతున్నట్లు తెలుస్తోంది.
* మహిళలకు 10 శాతం రిజర్వ్
అయితే ఈసారి మహిళలకు 10 శాతం షాపులను రిజర్వ్ చేశారు. 300కు పైగా షాపులను మహిళలు దక్కించుకున్నారు. ఒకరు ఎన్ని దరఖాస్తులు అయినా చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో చాలామంది సిండికేట్ లుగా మారి వందలాది దరఖాస్తులు చేసుకున్నారు.కానీ వారికి అనుకున్న స్థాయిలో షాపులు దక్కలేదు.కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వందలాది దరఖాస్తులు చేసుకుంటే.. 10 సంఖ్యలోపే షాపులు దక్కాయి. అందుకే ఇప్పుడు లాటరీలో షాపులు దక్కించుకున్న వారిపై సిండికేట్లు ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
* వాటాలకు డిమాండ్
అయితే కొన్ని జిల్లాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిండికేట్ల రూపంలో ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.షాపులో పెట్టుబడి పెట్టకుండా 20 శాతం వాటాలను డిమాండ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మరోవైపు సిండికేట్ వ్యాపారుల సైతం స్థానిక ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేసినట్లు తెలుస్తోంది. అయితే సిండికేట్లకు అనుకున్న స్థాయిలో షాపులు రాకపోవడంతో.. షాపులు దక్కించుకున్న సామాన్యులపై పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంతమంది మెత్తబడుతున్నట్లు తెలుస్తోంది. రెండు లక్షల పెట్టుబడికి కోటి 20 లక్షల వరకు లాభం వస్తుండడంతో.. షాపుల నిర్వహణ ఎందుకులే అంటూ కొంతమంది పక్కకు తప్పుకున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే మద్యం షాపుల పుణ్యమా అని సాధారణ వ్యక్తులు సైతం కోటీశ్వరులుగా మారుతున్నారు. ఒక్కసారిగా జాక్ పాట్ కొడుతున్నారు.