https://oktelugu.com/

Vizag : శ్వేత మృతికి కారణమేంటి? పోస్టుమార్టంలో కీలక విషయాలు

భర్త, అత్తమమాలు, ఆడపడుచుపై  వరకట్న వేధింపుల కేసు, సత్యంపై లైంగిక వేధింపుల కేసు నమోదుచేశారు. మొత్తం నలుగురూ పోలీసుల అదుపులో ఉన్నారు

Written By:
  • Dharma
  • , Updated On : April 28, 2023 / 11:47 AM IST
    Follow us on

    Vizag : విశాఖ ఆర్కే బీచ్ లో శవమై కనిపించిన శ్వేతాది ఆత్మహత్య? లేకుంటే అనుమానాస్పద మృతా? అన్నది తేలాల్సి ఉంది. దీనిపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత శ్వేత మృతదేహం ఆర్కే బీచ్ లో పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. అప్పటికే శ్వేత మిస్ అయినట్టు పోలీసులకు ఫిర్యాదు రావడంతో.. ఆ మృతదేహం శ్వేతగా గుర్తించారు. భర్తతో స్వల్ప వివాదాలే ఆమె మృతికి కారణంగా భావించారు. సూసైడ్ నోట్ లో కూడా అవే అంశాలు బయటకు వచ్చాయి.  అయితే కేసులో కొత్త కోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. సమీప బంధువు ఒకరు లైంగిక వేధింపులకు గురిచేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భర్తతో పాటు అత్తమామలు, ఆడపడుచు. ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తిచేసి నిందితులను మీడియా ముందుకు ప్రవేశపెట్టే చాన్స్ ఉంది.

    విశాఖలోని దొండపర్తి ప్రాంతానికి చెందిన శ్వేత కు పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు ప్రాంతానికి చెందిన గులివెల్లి మణికంఠతో గత ఏడాది ఏప్రిల్‌ 22న వివాహమైంది. మణికంఠ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా ఇంటి వద్ద నుంచే (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్) పనిచేస్తున్నాడు. భార్య, తల్లిదండ్రులతో కలిసి నెల్లిముక్కులో ఉంటున్నాడు. పదిహేను రోజుల కిందట ఆఫీస్‌ పని మీద హైదరాబాద్‌ వెళ్లాడు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం దంపతులిద్దరి మధ్య ఫోన్ లో వాగ్వాదం జరగడం, ఫోన్ ఇంట్లో విడిచిపెట్టి వెళ్లడం జరిగిపోయింది. రాత్రి 10 గంటలైనా శ్వేత ఆచూకీ లేకపోవడంతో అత్తమామలు న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడకు కొద్ది గంటలకే శ్వేత మృతిచెందినట్టు సమాచారం అందింది. అయితే ఓ సూసైడ్ నోట్ లభ్యం కావడంతో అంతా ఆత్మహత్యేనని భావించారు. కానీ శ్వేత తల్లి రమ మాత్రం లైంగిక వేధింపులపై ఫిర్యాదుచేశాడు. ఆడపడుచు భర్త సత్యం శ్వేతకు లైంగికంగా వేధించేవాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా భావిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు.

    భర్త, అత్తమమాలు, ఆడపడుచుపై  వరకట్న వేధింపుల కేసు, సత్యంపై లైంగిక వేధింపుల కేసు నమోదుచేశారు. మొత్తం నలుగురూ పోలీసుల అదుపులో ఉన్నారు. ఒక వైపు దర్యాప్తు కొనసాగుతుండగా.. పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారింది. కేజీహెచ్ లో ముగ్గురు వైద్యుల బృందం పోస్టు మార్టం చేసింది. ఆ నివేదికలో ఏముందనేది సస్పెన్ష్ గా మారింది. మరోవైపు శ్వేత ఇంటి నుంచి బయటకు వచ్చే క్రమంలో సమీపంలో ఉన్న సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె మృతిచెందిన బీచ్ ప్రాంతంలో సీసీ కెమెరాలు పనిచేయకపోడంతో దర్యాప్తునకు ఇబ్బందిగా మారింది. అయినా వీలైనంత త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.పోస్టుమార్టం నివేదికతో కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.