Supreme Court shock to CM Chandhrababu : తిరుపతి లడ్డు వివాదంలో కీలక పరిణామం. దేశ అత్యున్నత న్యాయస్థానం చంద్రబాబుకు షాక్ ఇస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది.దీంతో ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లడ్డు కల్తీ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండానే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత సిట్ దర్యాప్తునకు ఆదేశించడంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం సిట్ దర్యాప్తు కొనసాగింపు పైన గురువారం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధపడుతోంది. తిరుమలలో వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి, బిజెపి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటీషన్లపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రానికి సీఎం గా చంద్రబాబు ఈ వివాదం పై మీడియాతో మాట్లాడడం ఏమిటని ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్షాలు లేకపోవడంపై సీరియస్ అయింది. నెయ్యి శాంపిల్స్ పరీక్షలపై సెకండ్ ఒపీనియన్ తీసుకోకపోవడం, లడ్డూలను ముందే పరీక్షలకు పంపకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను వచ్చేనెల 3కు వాయిదా వేసింది.
* సిట్ పై అభ్యంతరాలు
లడ్డు వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సైతం పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సమీక్షకు అత్యున్నత న్యాయస్థానం సిద్ధమయింది. ఈ మేరకు సిట్ దర్యాప్తు కొనసాగాలా? లేకుంటే మరో దర్యాప్తు చేపట్టాలా? అనే అంశంపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరింది. తదుపరి విచారణలో సొలిసిటర్ జనరల్ తన అభిప్రాయాన్ని చెప్పనున్నారు. దాని ఆధారంగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది.
* సెకండ్ ఒపీనియన్ లేకుండా ఎలా?
గత కొద్దిరోజులుగా లడ్డు వివాదం జాతీయ స్థాయిలో సైతం కుదిపేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ కార్నర్ అయ్యింది. లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అన్నది ప్రధాన ఆరోపణ. ఓ బహిరంగ సమావేశంలో చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. గుజరాత్ కు చెందిన ఓ ల్యాబ్ నిర్ధారించిందని చెప్పుకొచ్చారు. అయితే ఇది టీటీడీ వ్యవహారమని.. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. ఆధారాలు లేనివిషయాన్ని ఎలా వెల్లడిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది.కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో కూడిన అంశంపై సెకండ్ ఒపీనియన్ లేకుండా ఎలా బయట పెడతారని ఆక్షేపించింది.
* చంద్రబాబు మెడకు చుట్టుకుంటాయా?
అయితే చంద్రబాబు వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ అత్యున్నత అధికార బృందం తిరుమలలో విచారణ చేపట్టింది. ఒకవేళ సొలిసిటర్ జనరల్ సిట్ దర్యాప్తునకు వ్యతిరేకంగా నివేదికలు ఇస్తే అత్యున్నత న్యాయస్థానం.. సిట్ దర్యాప్తును నిలిపివేయాలని ఆదేశించే అవకాశం ఉంది. అదే జరిగితే చంద్రబాబు సర్కార్ ఇరకాటంలో పడినట్టే. మొత్తానికైతే గత కొద్దిరోజులుగా ప్రధాన అంశంగా మారిపోయిన లడ్డు వివాదం.. కొత్త పరిణామాలకు దారి తీసే అవకాశాలుస్పష్టంగా కనిపిస్తున్నాయి. కోర్టు తీర్పుతో పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయి.