Cm Chandhrababu : ఏపీ సీఎం చంద్రబాబు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టారు. వారంలో ఒకరోజు పార్టీకి కూడా సమయం కేటాయిస్తున్నారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, గత ప్రభుత్వ వైఫల్యాలపై శ్వేత పత్రాలు, క్యాబినెట్ మీటింగ్లు, అధికారులతో సమీక్షలు.. ఇలా విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. సీఎంగా తన మార్కును చూపిస్తున్నారు. 1995 నాటి చంద్రబాబును చూపిస్తానంటూ పదేపదే చెబుతూ పాలనలోను దాన్ని నిజం చేసి చూపిస్తున్నారు. అయితే తాజాగా సీఎం చంద్రబాబు ఓ విషయంలో స్పందించిన తీరు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. ఒకే ఒక్క ట్విట్ తో అపాయింట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వైరల్ అంశంగా మారింది. ప్రముఖ సంఘ సేవకురాలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్ సీఎం చంద్రబాబును కలవాలని భావించారు. అయితే ఆమెకు సీఎం అపాయింట్మెంట్ లభించలేదు. దీంతో ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు సునీత కృష్ణన్. చంద్రబాబు సర్ మీ అపాయింట్మెంట్ తీసుకోవడానికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నా. మీరు చాలా బిజీగా ఉన్నారని నాకు తెలుసు. అయితే రెండు ముఖ్యమైన ప్రతిపాదనలు మీ ముందు ఉంచేందుకు వచ్చేవారం మధ్యలో ఎప్పుడైనా నాకు పది నిమిషాలు సమయం కేటాయించగలరు. అంటూ సునీత కృష్ణన్ ట్విట్ చేశారు. సాధారణ పద్ధతిలో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా కుదరకపోవడంతోనే ట్విట్ చేస్తున్నానని.. క్షమించాలని ఆమె కోరారు. అయితే గంటల వ్యవధిలోనే చంద్రబాబు స్పందించారు. రిప్లై కూడా ఇచ్చారు.
* నాలుగు గంటల వ్యవధిలో
ఆగస్టు పదో తేదీ మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాలకు సునీత కృష్ణన్ ట్విట్ చేశారు. రాత్రి 7 గంటల 40 నిమిషాలకు చంద్రబాబు స్పందించారు. ఆగస్టు 13వ తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు కలుద్దాం అంటూ చంద్రబాబు రిప్లై ఇచ్చారు. అపాయింట్మెంట్ కోరుతూ ట్విట్ చేసినందుకు పర్వాలేదు అంటూనే తన బృందం మిమ్మల్ని సంప్రదిస్తుందని చంద్రబాబు తెలియజేశారు. ఏపీ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామని.. మిమ్మల్ని కలవడం ద్వారా మరింత మెరుగ్గా ఏం చేయగలమో చర్చిద్దామని చంద్రబాబుకు బదులిచ్చారు.
* గతానికి భిన్నంగా
సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే క్షణం తీరిక లేకుండా గడుపుతారు. ఒక్కో సమయంలో క్యాబినెట్ సహచరులకే అపాయింట్మెంట్ లభించని పరిస్థితి. అందులోనూ చంద్రబాబు విషయంలో ఇది మరింత క్లిష్టం అన్నది తెలిసినదే. అయినా సరే చంద్రబాబు గంటల వ్యవధిలో స్పందించడం.. రిప్లై ఇవ్వడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులకు సైతం అపాయింట్మెంట్ ఇవ్వడం పై విశ్లేషకులు సైతం అభినందనలు తెలుపుతున్నారు. గతానికి భిన్నంగా.. చంద్రబాబు వైఖరి ఉండడం విశేషం.
* టిడిపి శ్రేణుల ప్రచారం
చంద్రబాబు స్పందించిన తీరుపై టిడిపి శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. ఒక సంఘ సేవకురాలు అడిగిన గంటల వ్యవధిలో అపాయింట్మెంట్ ఇవ్వడం, స్పందించిన తీరు, సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నమెంట్ అంటే ఇదేనంటూ టిడిపి ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో సైతం సీఎం చంద్రబాబు స్పందించిన తీరుపై ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిని టిడిపి ఒక ప్రచారాస్త్రంగా మార్చుకోవడం విశేషం.
No problem Sunita Garu. Let’s meet on Tuesday, Aug 13, at 2:00 PM. My team will get in touch. We’re working on making governance more accessible. Will see what we can do to improve upon our appointment systems, too. https://t.co/iP9vl1hrME
— N Chandrababu Naidu (@ncbn) August 10, 2024