Sundar Pichai: గూగుల్ ఏఐ డాటా సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నంలో మార్గం సుగమం అయింది. ఈ నేపథ్యంలో ఏఐ డాటా సెంటర్ ఏర్పాటును కూటమి ప్రభుత్వం స్వాగతించింది. అంతేకాదు ఇది ఏపీ ఆర్థిక రంగాన్ని పూర్తిగా మార్చేస్తుందని, ఏపీకి పెట్టుబడులు భారీగా వచ్చేలా దోహదపడుతుందని కూటమి ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని పెట్టుబడులు తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. విశాఖపట్నంలో నిర్వహించే పెట్టుబడిదారుల సదస్సుకు హాజరుకావాలని ఆస్ట్రేలియా ప్రతినిధులను ఆయన కోరుతున్నారు. త్వరలోనే విశాఖపట్నంలో నిర్వహించే పెట్టుబడిదారుల సదస్సులో ఆస్ట్రేలియా వ్యాపారులు పాల్గొంటారని తెలుస్తోంది.
సహజంగానే ఏపీలో రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి. కులాల కుంపట్లు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏఐ డాటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి వైసీపీ విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదని.. ఇదంతా కూడా జగన్ ప్రభుత్వంలో జరిగిందని చెప్పుకొచ్చింది. ఏఐ డాటా సెంటర్ ఏర్పాటులో అదానీ కీలక పాత్ర పోషించారని.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీ తో నాకు ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని వైసిపి ఆరోపిస్తోంది. వైసిపి అనుకూల మీడియా ఈ విషయంలో ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేస్తోంది.
ఈ వాదననలు సాగుతుండగానే గూగుల్ ఏఐ డాటా సెంటర్ ఏర్పాటు సంబంధించి ఆ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డాటా సెంటర్ ఏర్పాటులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ విశేషమైన కృషి చేశారని.. వారి వల్లే ఈ సెంటర్ ఏర్పాటయిందని.. గూగుల్ ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. విశాఖపట్నం నగరానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని.. అనేక అనుకూలతలు ఉన్నాయని.. అందువల్లే తాము ఈ నగరాన్ని ఎంచుకున్నామని సుందర్ వివరించారు. ఎప్పుడైతే సుందర్ ఈ మాటలు మాట్లాడారో.. అప్పట్నుంచి వైసిపి అనుకూల మీడియా అనేక రకాల కథనాలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది.
కొందరైతే ఏకంగా సుందర్ పిచాయ్ చౌదరి అని వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. చౌదరి కాబట్టే టిడిపికి అనుకూలంగా మాట్లాడుతున్నారని.. చంద్రబాబును వెనకేసుకొస్తున్నారని విమర్శిస్తున్నారు. దీనిపై టిడిపి నేతలు స్పందిస్తున్నారు. కులాల కుంపట్లు రగిలించడంలో వైసీపీ నేతల తరువాతే ఎవరైనానని.. ఏపీ బాగుపడుతుంటే వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని.. చివరికి సుందర్ పిచాయ్ కి కూడా కులాన్ని ఆపాదిస్తున్నారని విమర్శిస్తున్నారు.