Sudhaar Mart Visakhapatnam: ఏపీ ప్రభుత్వం( AP government ) వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. దాదాపు అన్ని శాఖల పరిధిలో స్వతంత్ర నిర్ణయాలు ఉంటున్నాయి. అందులో భాగంగా జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో సుధార్ మార్టులు ఏర్పాటు అవుతున్నాయి. విశాఖ సెంట్రల్ జైలులో ఖైదీల జీవితాల్లో మార్పు కోసం జైళ్ల శాఖ వీటిని ఏర్పాటు చేస్తోంది. అక్కడ ఖైదీలు తయారు చేసిన వస్తువులు, కూరగాయలు తక్కువ ధరకి లభిస్తాయి. దుప్పట్లు, బెడ్ షీట్లు, బ్లీచింగ్ పౌడర్, కేకులు, కూరగాయలు వంటివి మార్కెట్ ధర కంటే తక్కువకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మార్టుల ద్వారా లభించే డబ్బును ఖైదీల సంక్షేమానికి ఉపయోగిస్తారు. సుధార్ మార్టుగా పిలిచే.. ఈ దుకాణాల్లో కూరగాయల నుంచి కేకుల వరకు… దుప్పట్ల నుంచి బ్లీచింగ్ పౌడర్ వరకు చాలా తక్కువ ధరకే విక్రయిస్తారు. ఏపీ జైళ్ల శాఖ తీసుకున్న ఈ నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తోంది.
Also Read: వల్లభనేని వంశీకి మళ్లీ జైలు భయం!
ఖైదీల్లో మార్పు తెచ్చేందుకు..
విశాఖలోని సెంట్రల్ జైల్లో ( Visakha Central Jail )ఖైదీల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు జైళ్ల శాఖ అడుగులు వేస్తోంది. శిక్ష పడిన ఖైదీలకు వృత్తి విద్యలో శిక్షణ ఇస్తున్నారు. వారు తయారు చేసిన వస్తువులు, పండించిన కూరగాయలను, పండ్లను, జైలు అవసరాలకు వాడుతున్నారు. మిగిలిన వాటిని సుధార్ మార్ట్ ద్వారా తక్కువ ధరలకు స్థానికులకు అందిస్తున్నారు. ఖైదీలలో మార్పులు తెచ్చేందుకు జైళ్లలో వారితో అనేక రకాల పనులు చేయిస్తుంటారు. స్వయం ఉపాధికి శిక్షణ కూడా ఇస్తుంటారు. ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో వివిధ వస్తువుల తయారీలో ఖైదీలకు శిక్షణ ఇస్తుండడం విశేషం. కంప్యూటర్ శిక్షణతో పాటు వాహనాల మెకానిక్, వెల్డింగ్ వంటి కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తున్నారు. చదువుకోవాలనే వారికి దూరవిద్య ద్వారా పరీక్షలు రాయిస్తున్నారు. శిక్షాకాలం వృధా కాకుండా.. వారి జైలు విడుదల తరువాత కూడా జీవితం సాఫీగా సాగేలా ప్రణాళిక రూపొందించారు విశాఖ సెంట్రల్ జైలు అధికారులు. అయితే ఇప్పటికే జైల్లో శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఖైదీలలో సత్ప్రవర్తన తీసుకొచ్చేందుకు ఇలా సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగానే ఈ సరికొత్త మార్టులు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తాజా కూరగాయలతో పాటు అన్ని రకాల వస్తువులు ఇక్కడ దొరుకుతున్నాయి. దీంతో నగరవాసులు ఎక్కువగా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. జైళ్ల శాఖ అధికారుల ఆలోచనను అభినందిస్తున్నారు.
Also Read: ప్రియుడిని వలచి.. కట్టుకున్న మొగుడిని కడతేర్చి.. జైల్లో ఒంటరైన సోనమ్ కథ!
తాజా కూరగాయలు
అయితే ఇక్కడ తాజా కూరగాయలు ఎక్కువగా లభిస్తుండడంతో జనాలు ఎగబడుతున్నారు. పైగా బయట మార్కెట్ ధర కంటే తక్కువగా లభిస్తున్నాయి ఇక్కడ. రసాయనాల ప్రమేయం లేకుండా ఖైదీలు కూరగాయలు పండిస్తుంటారు. అలా వారు పండించిన ఆకుకూరలు, వంగ కాకర, ఆనప, టమోటా, ఆగాకర, దొండకాయ, బెండకాయ, మునగ కాడలు, క్యారెట్, బీట్రూట్, చిక్కుడుకాయ, బీరకాయ, పొట్లకాయ, ముల్లంగి మొదలైన వాటిని విక్రయిస్తున్నారు. అయితే విశాఖ లాంటి నగరంలో రైతు బజార్లు అందుబాటులోకి వచ్చినా అవి చాలడం లేదు. అయితే ఈ సుధార్ మార్టుల్లో తాజా కూరగాయలు లభిస్తుండడం.. బయట ధర కంటే తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.