Congress Strategy AP: ఏపీలో( Andhra Pradesh) కాంగ్రెస్ బలోపేతం దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందా? భారీ వ్యూహం రూపొందిస్తోందా? ఈ విషయంలో ఏపీలో అధికార కూటమి కూడా అదే కోరుకుంటుందా? కాంగ్రెస్ పార్టీ బలపడితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుందని అంచనా వేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల ఉన్నారు. అయితే ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడకపోవడంపై అనేక ఫిర్యాదులు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలో ఒక బలమైన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలోకి తెస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. వారికి తెచ్చి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ బలోపేతం కావడం ఖాయమని టాక్. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వం ఆ కుటుంబంతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు ఈ విషయంలో కూటమి సైతం అంతర్గతంగా సహకారం అందిస్తున్నట్లు సమాచారం.
Also Read: రాహుల్ జీ.. ఎన్నిరోజులు ఈ కాకమ్మ కథలు!
బలమైన నేపథ్యం..
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి( Congress Party) ఎనలేని ఆదరణ ఉండేది. సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఎన్టీఆర్ టిడిపిని ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చింది. అయినా సరే టిడిపి ప్రభంజనాన్ని తట్టుకొని మరి నిలబడింది. అయితే ఇలా తట్టుకోవడం వెనుక బలమైన కుటుంబ నేపథ్యం ఉన్న నేతలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. అందులో పాతూరి రాజగోపాల్ నాయుడు ఒకరు. ఆయన కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు. కృషికర్ లోక్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరి రెండుసార్లు చిత్తూరు నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు గల్లా అరుణకుమారి. ఈమె అమర్ రాజా కంపెనీ ఫౌండర్ గల్లా రామచంద్ర నాయుడు భార్య. తండ్రి వారసత్వంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు. పదేళ్లపాటు మంత్రిగా కూడా కొనసాగారు. రాష్ట్ర విభజనతో 2014లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమె కుమారుడు గల్లా జయదేవ్ 2014, 2019లో గుంటూరు ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికలకు ముందు క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
గల్లా కుటుంబంతో చర్చలు..
ప్రస్తుతం గల్లా కుటుంబం రాజకీయంగా సైలెంట్ గా ఉంది. అయితే ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఏ పీసీసీ అధ్యక్షులపై కూడా ఈ స్థాయిలో ఫిర్యాదులు లేనట్లు తెలుస్తోంది. షర్మిల ( Y S Sharmila ) సీనియర్లను కలుపుకొని వెళ్లడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆమె బాధ్యతలు తీసుకుని దాదాపు రెండేళ్లు అవుతోంది. పార్టీ నుంచి బయటకు వెళ్లిన నేతలే తప్ప.. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే నాయకులు కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో గల్లా ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే మేలన్న నిర్ణయానికి హై కమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు గల్లా కుటుంబంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధాని అవుతారని.. ఏపీలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఆ ఐదుగురిని నమ్ముకున్న జగన్!
చంద్రబాబు సహకారం.
అయితే ఈ విషయంలో చంద్రబాబు( CM Chandrababu) సహకారం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నట్లు అనుమానాలు ఉన్నాయి. గల్లా జయదేవ్ తో పాటు అరుణకుమారి చంద్రబాబుకు సన్నిహితులు. వారి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే 2018లో బిజెపితో కటీఫ్ చెప్పింది టిడిపి. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడడంతో తెలుగుదేశం పార్టీ బిజెపికి టార్గెట్ అయింది. ఈ క్రమంలోనే పారిశ్రామికవేత్త అయిన గల్లా జయదేవ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వంతోనూ.. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతోనూ ఇబ్బందులు పడ్డారు. అందుకే క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై ప్రకటించారు. అయితే ఓ పారిశ్రామికవేత్తగా, చరిష్మ ఉన్న కుటుంబం గా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకుంటే తప్పకుండా ఆ ప్రభావం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై పడుతుంది. కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు వస్తే వైసీపీలో అసంతృప్తి నేతలు సైతం ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. అందుకే ఈ విషయంలో చంద్రబాబు సైతం ఒప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.