Botsa Satyanarayana: గెలిస్తే వ్యక్తిగత విజయం.. ఓడితే జగన్ వైఫల్యం.. బొత్స గట్టి ప్లాన్!

సుదీర్ఘ రాజకీయ నేపథ్యం బొత్స సొంతం. కోపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా రాజకీయ జీవితం ప్రారంభించిన బొత్స.. అనతి కాలంలోనే ఎదిగారు. ఉమ్మడి రాష్ట్రానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.

Written By: Dharma, Updated On : August 6, 2024 9:54 am

Botsa Satyanarayana

Follow us on

Botsa Satyanarayana: ఇప్పుడు అందరి చూపు విశాఖపై పడింది. ఈరోజు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కానుంది. ఆగస్టు 30న ఎన్నిక జరగనుంది. ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. విశాఖ స్థానిక సంస్థల్లో వైసీపీకే స్పష్టమైన మెజారిటీ ఉంది. మొత్తం ఆ పార్టీకి 615 మంది స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.టిడిపి కూటమికి కేవలం 215 మంది మాత్రమే మద్దతుదారులు ఉన్నారు.గతంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఏకగ్రీవంగా గెలిచారు. తగినంత బలం లేకపోవడంతో అప్పట్లో టిడిపి పోటీ చేయలేదు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయం చవిచూసింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.ఎన్నికలకు ముందు.. తరువాత పెద్ద ఎత్తున వైసీపీ నుంచి టిడిపి తో పాటు కూటమి పార్టీల్లోకి చేరికలు పెరిగాయి. మిగతా వారిని సైతం టిడిపిలో తీసుకురావడానికి ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఉన్నది మూడు వారాలు మాత్రమే. భారీ సంఖ్యలో వైసీపీ నుంచి చేరికలు ఉంటే తప్ప టిడిపి కూటమి అభ్యర్థి విజయం సాధించే ఛాన్స్ లేదు. అయితే ఇప్పటికే విశాఖ నగరపాలక సంస్థకు చెందిన కార్పొరేటర్లు పెద్ద ఎత్తున టిడిపి, జనసేనలో చేరారు.మరికొందరు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే చేరికల విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కూటమిలోని మూడు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి.అయితే ఇప్పుడు వైసిపి నేరుగా అభ్యర్థిని ప్రకటించడంతో..మూడు పార్టీలు పునరాలోచనలో పడ్డాయి. ఎట్టి పరిస్థితుల్లో వైసిపికి అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నాయి. అందుకే మూడు పార్టీలు రంగంలోకి దిగాయి. వీలున్నంత మేరకు వైసిపి స్థానిక ప్రజా ప్రతినిధులను పార్టీల్లోకి రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

* ఎంపిక వెనుక అనేక వ్యూహాలు
వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఎంపిక వెనుక వ్యూహాలు ఉన్నాయి. బలమైన సామాజిక వర్గంతో పాటు ఆర్థికంగా పట్టున్న నేత. సీనియర్ నేతగా ఉత్తరాంధ్ర పై బొత్సది చెరగని ముద్ర. ప్రస్తుతం బొత్స కుటుంబానికి రాజకీయ ప్రాతినిధ్యం లేదు.ఆ కుటుంబం నుంచి నలుగురు పోటీ చేశారు. అందరూ ఓడిపోయారు. చివరికి చీపురుపల్లిలో బొత్స హవాకి కూడా బ్రేక్ పడింది. ఈ తరుణంలో బొత్సకు రాజకీయ అండదండలు కీలకంగా మారాయి.అందుకే ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

* సాహస నిర్ణయమే
ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిరెండు నెలలు దాటుతోంది.వైసీపీకి దారుణ పరాజయం ఎదురయింది. విశాఖ జిల్లాలో వైట్ వాష్ చేసింది కూటమి.ఎక్కడా 40,000 మెజారిటీ తగ్గలేదు. ప్రతి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మిభారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు.అయితే ఓడిపోయి రెండు నెలలు గడవక ముందే మరో ఎన్నికల్లో పోటీ అంటే రిస్క్ చేసినట్టే. అయితే బొత్సకు రిస్కు చేయని తప్పని పరిస్థితి ఎదురైంది. ఎమ్మెల్సీగా ఎన్నికైతే పొలిటికల్ లైన్ లైట్లో ఉండవచ్చని బొత్స భావించారు.

* ఇద్దరికీ కీలకమే
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక అటు జగన్ తో పాటు బొత్సకు కీలకమే. బలమైన అభ్యర్థి కావడంతో తన వ్యూహంతో బొత్స ముందుకు వెళ్తారని జగన్ భావిస్తున్నారు. తాను ఎమ్మెల్సీగా గెలిస్తే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని బొత్స అంచనా వేస్తున్నారు. బొత్స సొంత బలంతో గెలిచినా పార్టీకి ఊపు తెస్తుందని జగన్ విశ్వసిస్తున్నారు. అయితే గెలుపు అంత ఈజీ కాదని బొత్స కు తెలుసు. ఒకవేళ తాను గెలిస్తే వ్యక్తిగత విజయంగా బొత్స చెప్పుకుంటారు. ఓడిపోతే మాత్రం వైసిపి వైఫల్యంగా అభివర్ణిస్తారు. జగన్ డిఫెన్స్ లో పడటం ఖాయం. అందుకే బొత్స పోటీ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.