Pawan Kalyan : ఏపీలో ఎన్నికల వేళ రాళ్లదాడి కలకలం రేపుతోంది. శనివారం రాత్రి విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై రాయితో దాడిని మర్చిపోకముందే.. ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అలాంటి స్థాయిలోనే దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో వారాహి వాహనంలో పవన్ కళ్యాణ్ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ పైకి రాయి విసిరారు. దీంతో పవన్ కళ్యాణ్ అప్రమత్తమయ్యారు. ఆ రాయిని దృష్టిలో పెట్టుకొని దూరం జరగగా, అది కొంత దూరంలో పడింది. ఈ ఘటనతో జనసైనికులు అప్రమత్తమయ్యారు.. వెంటనే నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.. అయితే ఆ వ్యక్తి ఎవరు?, ఎందుకు పవన్ కళ్యాణ్ పై దాడి చేశాడు?, అతని నేపథ్యం పై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా బ్లేడ్ బ్యాచ్ తనపై దాడి చేసేందుకు ప్రణాళిక రూపొందించిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కొంతమంది వ్యక్తులు బ్లేడ్లతో తిరుగుతూ తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని.. చివరికి తనపై కూడా దాడులు చేసేందుకు యత్నించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. అయితే ఈ ఆరోపణలను వైసీపీ శ్రేణులు ఎగతాళి చేశాయి. పవన్ కళ్యాణ్ పై దాడులు ఎవరు చేస్తారంటూ ఎద్దేవా చేశాయి. కానీ చివరికి కొంతమంది వ్యక్తులు జనసేన ఎన్నికల ప్రచారంలో బ్లేడ్లతో తిరుగుతుండగా ఇటీవల పోలీసులు పట్టుకున్నట్టు వార్తలు వినిపించాయి. దీంతో వైసీపీ శ్రేణులు ఒకసారిగా సైలెంట్ అయిపోయాయి.
ఇక శనివారం రాత్రి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై రాళ్లదాడిని మర్చిపోకముందే.. పవన్ కళ్యాణ్ పై గుర్తుతెలియని వ్యక్తి రాయితో దాడి చేయడం ఒక్కసారిగా కలకలం రేపింది. రాయి దూరంగా పడిపోవడంతో జనసైనికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ఆ రాయి గనుక పవన్ కళ్యాణ్ కి తాకి ఉంటే తీవ్ర గాయం అయ్యేదని జనసేన నాయకులు చెబుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో తెనాలిలో యాత్ర నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోప్ పార్టీ ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ బందోబస్తును పర్యవేక్షిస్తోంది. ఎన్నికల సంఘం అధికారులకు ఈ విషయం తెలియడంతో అప్రమత్తమయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పోలీసులకు సమాచారం అందించి, బందోబస్తు పెంచాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ఈ ఘటన తర్వాత ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.