Sri Rama Navami 2025: దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు( Sri Rama Navami festivals ) ప్రారంభమయ్యాయి. రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి రామాలయంలో సీతారామ లక్ష్మణులతో పాటు ఆంజనేయుడు కూడా కొలువై ఉంటాడు. రాములోరి సేవలో తరిస్తూ భక్తుల పూజలు అందుకుంటూ ఉంటాడు. కానీ ఓ చోట మాత్రం ఆంజనేయుడు లేని రామాలయం ఉంది. దానికి ఒక ప్రత్యేకత ఉంది. వెనుక ఒక ప్రాశస్త్యం కూడా ఉంది. రామాలయం లేని ఊరు.. హనుమంతుడు లేని రాములోరి ఆలయం ఉండదనేది పెద్దల మాట. కానీ హనుమంతుడు లేని రామాలయం మన ఏపీలోనే ఉండడం విశేషం.
Also Read: ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు.. టీటీడీ ప్రతిష్టాత్మక ఏర్పాట్లు!
* పురాతనమైన ఆలయం..
వైయస్సార్ కడప( YSR Kadapa district ) జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం పురాతనమైనది. ఉమ్మడి ఏపీలో శ్రీరామనవమి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రాచలం రాములోరి ఆలయంలో నిర్వహించేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తరఫున కడపలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఈ ఆలయంలో ఆంజనేయుడు విగ్రహం ఉండదు. దాని వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. ఆంజనేయస్వామిని కలవక ముందే ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు సంచరించారని.. అందుకే ఈ ఆలయంలో ఆంజనేయుడు విగ్రహం ఉండదనేది స్థానికులు చెప్పే మాట.
* సుదీర్ఘ చరిత్ర..
కోదండరామ స్వామి ఆలయానికి( kodanda Ramaswamy Temple ) సుదీర్ఘ చరిత్ర ఉంది. ఎంతో పురాతనమైనది కూడా. ఒకే శిలపై సీతారామ లక్ష్మణ దేవత మూర్తుల విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. అందుకే ఒంటిమిట్టను ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. త్రేతా యుగంలో సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు దండకారణ్యంలో సంచరిస్తూ ఇక్కడికి వచ్చారని పురాణాలు చెబుతుంటాయి. ఆ సమయంలో సీతాదేవికి బాగా దప్పిక చేసిందని.. సీతాదేవి దప్పిక తీర్చేందుకు శ్రీరాముడు భూమిలోకి బాణం వేస్తే నీటి బుగ్గ పుట్టిందని పురాణాల్లో ఉంది. అదే ఒంటిమిట్ట రామతీర్థం అయిందని చెబుతుంటారు.
* రకరకాల కథలు..
ఈ ఆలయానికి సంబంధించిన పేరు పై కూడా అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కోదండరామస్వామి ఆలయాన్ని మట్టి మీద నిర్మించారని.. అందుకే ఒంటిమిట్ట రామాలయం( ramalayam) అని పేరు వచ్చిందని కొంతమంది చెబుతుంటారు. అలాగే ఒంటుడు, మిత్రుడు అనే ఇద్దరు రామభక్తులు ఈ గుడిని నిర్మించారని.. వారి పేరు మీద ఒంటిమిట్ట రామాలయం అయిందనేది మరో వాదన. సీతారాముల కళ్యాణం తర్వాత మృకండ మహర్షి, శృంగి మహర్షి యాగరక్షణ కోసం శ్రీరామ లక్ష్మణులు ఇక్కడకు వచ్చారని.. అందుకు ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏర్పాటు చేయించారని మరో కారణం. ఈ విగ్రహాలను తరువాత కాలంలో జాంబవంతుడు ప్రాణ ప్రతిష్ట చేశాడని మరికొందరు నమ్మకంగా చెబుతుంటారు. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయంలో ఈనెల 11న స్వామి వారి కల్యాణ వేడుకలు జరగనున్నాయి. ఈరోజు నుంచి ప్రారంభం కానున్న శ్రీరామనవమి వేడుకలు ఈనెల 14 వరకు కొనసాగనున్నాయి.