Srikakulam Politics: ఎవరైనా ప్రజా నాయకుడిగా మారాలంటే ప్రతిపక్షం లో ఉన్నప్పుడే సాధ్యం అన్నది పెద్దల మాట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడే నాయకుడికి ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు శ్రీకాకుళం( Srikakulam ) సీనియర్ పొలిటీషియన్లు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, కృష్ణ దాస్ సోదరులతో పాటు తమ్మినేని సీతారాం తమ వారసులను బరిలో దించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే కరెక్ట్ టైం అని అంచనా వేస్తున్నారు. వారిని ప్రజల్లోకి వదులుతున్నారు. పార్టీ శ్రేణులతో మమేకం అయ్యేలా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాము తప్పుకొని వారసులకు అవకాశం ఇవ్వాలని అధినేత జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నారు. అయితే వచ్చే ఎన్నికలు పార్టీకి చావో రేవో లాంటివి జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ముందుకు వెళ్తానని చెప్పినట్లు సమాచారం. దీంతో పిల్లల భవిష్యత్తుపై ఆ ముగ్గురు నేతలు ఎంతో ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది.
* సుదీర్ఘ నేపథ్యం..
ఉమ్మడి ఏపీలోనే( Andhra Pradesh) తనకంటూ ఒక రాజకీయ ముద్రను చాటుకున్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టి మంత్రి పదవి చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ కాలం మంత్రి పదవి చేపట్టిన నేతగా గుర్తింపు పొందారు. 1989 నుంచి 94 వరకు మంత్రిగా ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు ఈ రాష్ట్రానికి మంత్రిగా కొనసాగారు. నవ్యాంధ్రప్రదేశ్లో రెండేళ్ల పాటు మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే తన బదులు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు కు అవకాశం కల్పించాలని అధినేత జగన్మోహన్ రెడ్డిని మొన్ననే కోరారు ధర్మాన ప్రసాదరావు. అయితే 2024 ఎన్నికల్లో జగన్ అంగీకరించలేదు. కనీసం 2024 ఎన్నికల్లోనైనా అవకాశం ఇస్తారని భావించి ప్రజల్లోకి వదులుతున్నారు తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు ను.
* కుమారుడి కోసం కృష్ణదాస్..
మరోవైపు నరసన్నపేట( narasannapeta ) నుంచి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు ధర్మాన కృష్ణ దాస్. మొన్నటి ఎన్నికల్లో తాను తప్పుకొని కుమారుడు కృష్ణ చైతన్యకు అవకాశం ఇవ్వాలని అధినేత జగన్మోహన్ రెడ్డిని కోరారు కృష్ణ దాస్. కానీ అందుకు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. సీనియర్ గా ఉన్న మీరే పోటీ చేయాలని అధినేత కోరడంతో అయిష్టంగానే పోటీ చేశారు కృష్ణదాస్. దారుణ పరాజయం ఎదురు కావడంతో వచ్చే ఎన్నికల్లో కృష్ణ చైతన్యను నిలబెట్టాలని చూస్తున్నారు. అయితే పార్టీ శ్రేణులతో మమేకమై పని చేస్తేనే అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో గత కొద్ది రోజులుగా కృష్ణ చైతన్య ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. ముఖ్యంగా పార్టీ శ్రేణులతో మమేకమై పనిచేస్తున్నారు. గత కొద్ది రోజులుగా అయ్యప్ప దీక్షలో ఉన్న కృష్ణ చైతన్య కుటుంబానికి దూరంగా ఉంటూ.. పార్టీ శ్రేణులకు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది.
* తమ్మినేనిది మరో టైపు..
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ది ( tammaneni Sitaram) మరో పరిస్థితి. ప్రస్తుతం ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. కుమారుడు చిరంజీవి నాగ్ కు మంచి పొలిటికల్ లైఫ్ ఇవ్వాలని భావించారు. మొన్నటి ఎన్నికల్లో తాను తప్పుకుంటానని.. తన కుమారుడికి ఛాన్స్ ఇవ్వాలని అధినేత జగన్మోహన్ రెడ్డిని కోరారు. కానీ జగన్ అంగీకరించలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఓ ద్వితీయ శ్రేణి నేతకు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తమ్మినేని కుమారుడు కి ఛాన్స్ అనేది అంత ఈజీ కాదని ప్రచారం సాగుతోంది. మొత్తానికి అయితే శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు సీనియర్లు తమ వారసులకు రాజకీయ జీవితం ఇవ్వాలన్న ప్రయత్నం ఏమంత ఆశాజనకంగా లేదు. అయితే బలమైన నేపథ్యం ఉన్న కుటుంబాలు కావడంతో జగన్మోహన్ రెడ్డి తలొగ్గక తప్పదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.