Sonia Gandhi – Vijayamma : 8న ఇడుపాలపాయకు సోనియా గాంధీ.. విజయమ్మతో భేటీ? ఏం జరుగనుంది?

ప్రజలకు సానుకూల సంకేతాలు పంపాలన్న ఉద్దేశ్యంతో వైఎస్సార్ జయంతికి నేరుగా ఇడుపాలపాయకు సోనియా గాంధీ రానున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకూ వాస్తవమో అన్నది తెలియాల్సి ఉంది.

Written By: Dharma, Updated On : July 2, 2023 5:45 pm
Follow us on

Sonia Gandhi – Vijayamma : ఏపీ సీఎం జగన్ కు సోనియా గాంధీ షాకివ్వనున్నారా? వైఎస్ కుటుంబంలో చీలిక తేనున్నారా? ఒకప్పటి తమ సామంత రాజు కుటుంబాన్ని చేరదీయనున్నారా? వైసీపీ అధినేతపై భారీ రివేంజ్ కు ప్లాన్ చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏకంగా సోనియాగాంధీయే జగన్ అడ్డాకు వచ్చి విజయమ్మతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఇందుకు జూలై 8 వైఎస్సార్ జయంతి వేదిక కానున్నట్టు సమాచారం. ఇడుపాలపాయలో వైఎస్ షర్మిళ, విజయమ్మతో పాటు సోనియా గాంధీ కలిసి నివాళులర్పించనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఢిల్లీ నుంచి వచ్చిన భద్రత సిబ్బంది ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసినట్టు తెలుస్తోంది. వారు క్లియరెన్స్ ఇస్తే మాత్రం సోనియా, ఆమె వెంట రాహుల్ గాంధీ రానున్నట్టు టాక్ నడుస్తోంది.

రాజశేఖర్ రెడ్డి మరణం వరకూ వైఎస్ కుటుంబం సోనియాగాంధీతో మంచి సంబంధాలే కొనసాగించేది. అయితే మహానేత అకాల మరణంతో రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు తెగిపోయాయి తండ్రి తరువాత అధికారాన్ని అప్పగించలేదన్న అక్కసు జగన్ లో పెరిగింది. పార్టీకి దూరమయ్యారు. కేసులతో పాటు జైలు జీవితాన్ని ఎదుర్కొన్నారు. తరువాత వైసీపీని స్థాపించారు. అదే సమయంలో రాష్ట్ర విభజన ప్రకటన చేసి కాంగ్రెస్ పార్టీ ఏపీలో మూల్యం చెల్లించుకుంది. కాంగ్రెస్ స్థానాన్ని వైసీపీ కబళించింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నిస్తేజంగా మారింది.

2019 ఎన్నికల వరకూ వైఎస్ కుటుంబం ఐక్యతగానే సాగింది. కుమారుడు జగన్ కు అండగా విజయమ్మ, సోదరుడి కోసం షర్మిళ చాలా కష్టపడ్డారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ స్థాయిలో ప్రాధాన్యం తగ్గింది. దీంతో షర్మిళ సోదరుడితో విభేదించి తెలంగాణలో వైఎస్సార్ టీపీని స్థాపించారు. రాజన్న రాజ్యం తెస్తానని ఊరూవాడా ప్రచారం చేశారు. కానీ పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో విలీనానికి రంగం సిద్ధం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని షర్మిళ ఖండించినా.. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ తో మంతనాలు కొనసాగిస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్ చర్చ నడుస్తోంది.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యంతోనే హైకమాండ్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు సమాచారం. షర్మిళకు కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించాలన్నది వ్యూహం. అదే సమయంలో ఏపీ పగ్గాలు అప్పగించి.. వైసీపీ నుంచి నేతలను ఆకర్షించాలన్నది టార్గెట్. ఇప్పటికే సానుకూల చర్చలు జరిగినట్టు సమాచారం. ప్రజలకు సానుకూల సంకేతాలు పంపాలన్న ఉద్దేశ్యంతో వైఎస్సార్ జయంతికి నేరుగా ఇడుపాలపాయకు సోనియా గాంధీ రానున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకూ వాస్తవమో అన్నది తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఇంతవరకూ అధికార ప్రకటనేదీ వెలువడలేదు.