YS Jagan : జగన్ లో ఏదో తేడా కనిపిస్తోంది. గత నాలుగేళ్లకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యేవారు. అక్కడ నుంచే పాలనా, ఇతరత్రా సంక్షేమ పథకాలను బటన్ నొక్కి విడుదల చేసేవారు. అయితే ఇప్పుడు ఎందుకో తాడేపల్లిలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. నిత్యం జనాల్లో ఉండడానికి పరితపిస్తున్నాయి. అయితే ఈ సెడన్ చేంజ్ కు కారణమేంటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇన్నళ్లూ తాడేపల్లి ప్యాలెస్ వదిలి రావడం లేదని జగన్ ను విమర్శించిన విపక్షాలు..ఇప్పుడు మరోరకంగా విశ్లేషణలు చేస్తున్నాయి.
పాదయాత్ర చేసే సమయంలో జనమే నా అభిమతం, జనంతోనే తన జీవితమని జగన్ చెప్పుకొచ్చారు. ముద్దులు, దీవెనలతో వారిని ఆకట్టుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక జనం వద్దు అన్న రీతిలో వ్యవహరించడం ప్రారంభించారు. జనంలోకి వచ్చినా.. తనకూ వారికి మధ్య పరదాలు, బారికేడ్లు అడ్డుగా పెట్టుకున్నారు. జగన్ పర్యటనకు అడ్డంకిగా నిలుస్తాయని చెట్లను, రహదారులను అధికారులు ధ్వంసం చేస్తున్నారు. అయితే ఇలా పర్యటనలకు వచ్చి దూరం నుంచే ప్రజలను చూసి అభివాదం చేసి వెళ్లిపోతున్నారు.
ఇప్పటి వరకూ ఏపీలో జగన్ పై అసంతృప్తి రాకుండా చేస్తున్న ఆయుధాలు సంక్షేమ పథకాలే. ఏకంగా సంవత్సరానికి 70 వేల కోట్ల రూపాయలు ఈ సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నారని అంచనా.కానీ రావలసినంత మైలేజీ లేదు. పథకాలు వట్టిగా ఇస్తున్నారే.. అది మేము కట్టిన పన్నులే కదా అని ప్రశ్నిస్తున్నారు. సంక్షేమం తప్ప అభివృద్ధి లేకపోవడం కూడా మైనస్ గా మారుతోంది. ఇంత చేస్తున్నా ప్రజల్లో సంతృప్తి లేకపోవడం జగన్ కు కలవరపాటుకు గురిచేస్తోంది. అభివృద్ధి పేరిట ఏదో ఒకటి చేస్తే కానీ గట్టెక్కలేమని భావించి జగన్ జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. జనం మధ్యకు వెళ్లి సంక్షేమ పథకాల బటన్ నొక్కుతున్నారు.
అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో శంకుస్థాపన చేస్తే అది అభివృద్ధి.. చివర్లో చేస్తే అది మోసమవుతుందని జగన్ చెప్పుకొచ్చేవారు. కానీ దురదృష్టవశాత్తూ చివర్లోనే శంకుస్థాపనలు చేస్తున్నారు. పోర్టులు, సాగు,తాగునీటి ప్రాజెక్టులు, గృహనిర్మాణం.. ఇలా ఒకటేమిటి అన్నింటికీ శంకుస్థాపనలు చేస్తున్నారు. తొలి నాలుగేళ్లుగా సంక్షేమాన్ని నమ్ముకున్నా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ప్రజల్లో సంతృప్తి శాతం పెరగడం లేదు. అందుకే తాను చెప్పినట్టు అది మోసమని తెలిసినా జగన్ కు ప్రజల్లోకి వెళ్లేందుకు శంకుస్థాపనలకు మించిన కార్యక్రమాలు కనిపించడం లేదు.