https://oktelugu.com/

Makar Sankranti : పందెం బరిలో ఇన్ని రకాల కోళ్లా.. ఒక్కో దానికి ఒక్కో లెక్క..

కసి కొద్దీ పోట్లాడే డేగ.. ఎగిరెగిరి దుంకులాడే నెమలి.. ధైర్యంగా పోరాడే సీతువ.. రెచ్చిపోయి విజృంభించే డేగ.. ఇలా సంక్రాంతి పందెంబరిలో ఎన్నో కోళ్లు.. ఒక్కో దానికి ఒక్కో లెక్క..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 12, 2025 / 08:58 AM IST

    Pandem Kollu Types

    Follow us on

    Makar Sankranti :  సంక్రాంతి అంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, పిండి వంటలు, నట్టింట సందడి చేసే ఆడపడుచులు మాత్రమే కాదు.. పందెం కోళ్ళు కూడా.. కొంతకాలంగా ఆంధ్ర ప్రాంతంలో పందాలు ఒక స్టేటస్ సింబల్గా మారిపోయాయి. అందువల్లే పందెం కోళ్ల పరిశ్రమ కూడా అంతకంతకు విస్తరించింది. బయటకు చెప్పడానికి చాలామంది పెద్దగా ఇష్టపడరు కానీ.. ఇది ఏకంగా వందల కోట్ల పరిశ్రమగా ఎదిగిపోయింది. ఆంధ్రాలో పెద్దపెద్ద నగరాలు, పట్టణాలు ఉన్నప్పటికీ కోస్తా జిల్లాల్లో జరిగే సంక్రాంతి సంబరాలు మామూలుగా ఉండవు. భీమవరం, రాజమండ్రి, పాలకొల్లు, కాకినాడ, తణుకు, జంగారెడ్డిగూడెం వంటి ప్రాంతాలలో హోటల్స్ మొత్తం బుక్ అయిపోయాయంటే ఉన్న పందెం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.. విఐపి ల కోసం పందాలు జరిగే స్థానాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్ద బరుల వద్ద అయితే ప్రత్యేకమైన విందు వినోదాలు ఏర్పాటు చేశారు. ఇక ప్రత్యేక ఆఫర్ల గురించి చెప్పాల్సిన పనిలేదు.

    ఇతర ప్రాంతాల నుంచి రాక

    ఈసారి పందాలకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా పందెం రాయుళ్లు వచ్చారని తెలుస్తోంది. వచ్చే ఐదు రోజుల వరకు అన్ని హోటల్స్ మొత్తం బుక్ అయిపోయాయంటే ఏ రేంజ్ లో తాకిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. భీమవరం గ్రామీణ మండలంలో భారీ ఎత్తున వినోద కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భీమవరం మండలంలోని పెద అమిరం అనే గ్రామంలో ప్రారంభ పందాన్ని కోటి రూపాయలతో నిర్వహిస్తున్నారు. అయితే పందెం కోళ్లను ఈసారి ఇతర ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చారు.. కాకి, డేగ, నెమలి, సీతువ, కాకి డేగ వంటి కోళ్ళు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటిని పెంచే విషయంలోనూ నిర్వాహకులు పకడ్బందీ విధానాలు పాటించారు. దీంతో పందెం రాయుళ్లు ఈసారి వీటి పైన కోట్లల్లో పందాలు కాయడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కాకి, డేగ మీద భారీగా పందాలు కాస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈసారి పందెపురాయుళ్లు ఎక్కువగా వెళ్లారని తెలుస్తోంది.. గతంలో జరిగిన పందాలలో తెలంగాణ ప్రాంతాల నుంచి భారీగానే ప్రజలు అక్కడికి వెళ్లారు. పందాలలో భారీగా సంపాదించారు. దీంతో ఈసారి కూడా అదే స్థాయిలో సంపాదించాలని అక్కడికి వెళ్లారు. మరో వైపు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పందెపు రాయుళ్లు ఎక్కువగానే అక్కడికి చేరుకున్నారు. నిర్వాహకులు కూడా భారీగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈసారి సంక్రాంతి పందాలు మరింత జోరుగా సాగే అవకాశం కనిపిస్తోంది. వందల కోట్లు చేతులు మారుతాయని తెలుస్తోంది. ఇక మద్యం ప్రవాహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని నిర్వాహకులు అంటున్నారు.