SIT targets Vijayasai Reddy: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకొని కూటమి వ్యూహం పన్నుతోంది. మరోవైపు కూటమి వైఫల్యాలను ఎండగట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎత్తుకు పైఎత్తులు కొనసాగుతున్నాయి. కొద్దిరోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా భావిస్తున్న విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఇకనుంచి రాజకీయాలు మాట్లాడనని చెప్పిన విజయసాయిరెడ్డి.. అలా ఉండలేకపోయారు. రాజకీయంగా సంచలన ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అనలేదు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలపై విమర్శలు మాత్రం చేశారు. అయితే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గూటికి చేరుతారని ప్రచారం ప్రారంభమైంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సిట్ ఆయనకు నోటీసులు జారీచేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించి రేపు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారు అన్న వార్తల నేపథ్యంలో ఈ నోటీస్ అందడం విశేషం.
మద్యం కుంభకోణంలో సంచలనం..
కొద్ది నెలల కిందట వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. ఇకనుంచి రాజకీయాలు మాట్లాడనని.. వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే తరచూ రాజకీయ విమర్శలు చేస్తూ హైలెట్ అవుతున్నారు. ముఖ్యంగా మద్యం కుంభకోణం విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. గతంలో రెండు సార్లు సిట్ దర్యాప్తునకు హాజరయ్యారు. మద్యం కుంభకోణంలో సూత్రధారి రాజ్ కసిరెడ్డి అంటూ తేల్చి చెప్పారు. మద్యం కంపెనీలతో సిట్టింగ్ సమయంలో తాను ఉన్నానని.. కానీ తనకు ఆ మద్యం కుంభకోణంతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయితే పార్టీ నుంచి దూరమైన విజయసాయిరెడ్డిని దగ్గర చేర్చుకుంటే మేలని వైయస్సార్ కాంగ్రెస్ కీలక నేతలు జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. ఆయన సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇటువంటి సమయంలో మూడోసారి సిట్ దర్యాప్తునకు రావాలని విజయసాయిరెడ్డి కి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: జనసేనలోకి దువ్వాడ?
వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యం..
వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో విజయసాయి రెడ్డికి( Vijaya Sai Reddy) చాలా ఏళ్లుగా సాన్నిహిత్యం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి తో పాటు అవినీతి కేసుల్లో జైలు పాలయ్యారు. ఏకంగా 16 నెలల పాటు జైలులో ఉండి పోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో సైతం క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు చాలా కృషి చేశారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి మించి కష్టపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న నేతల తీరుతోనే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. తనకంటే ఎక్కువగా వారికే ప్రాధాన్యం ఇస్తుండడంతో.. పార్టీలో ఉండడం దండగ అని భావించి గుడ్ బై చెప్పారు.
సీనియర్ల రాయబారం
అయితే ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీలో వ్యూహకర్తలు తక్కువయ్యారు. జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ఆదేశాలను పాటించేవారు కరువయ్యారు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డిని తెచ్చుకుంటే బాగుంటుంది అని ఎక్కువమంది వైసీపీ సీనియర్లు అభిప్రాయపడ్డారు. దీంతో కొందరు విజయసాయిరెడ్డి తో నేరుగా చర్చలు జరిపినట్లు ప్రచారం సాగింది. అయితే ఈ సమయంలోనే మద్యం కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న సిట్ నుంచి విజయసాయి రెడ్డికి నోటీసులు అందడం విశేషం.