SIR draft roll: భారత ఎన్నికల సంఘం ( Chief Election Commission) చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. మరోవైపు మేధావి వర్గం సైతం అభ్యంతరాలు చెబుతోంది. ఈ సవరణలో భాగంగా చాలా రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారు. దీంతో ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నికల సంఘం తాజాగా తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాల ప్రకారం తమిళనాడులోని 97.37 లక్షల ఓట్లను తొలగించినట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. గుజరాత్ లోను 73 లక్షల ఓట్లను జాబితా నుంచి తొలగించారు. తొలుత బీహార్లో ఈ ప్రక్రియ చేపట్టి ఎన్నికలు నిర్వహించారు. అక్కడ ఎన్డీఏ ఘనవిజయం సాధించడంతో ప్రత్యేక సమగ్ర సవరణ అనేది రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నది అనే వాదన బలపడింది. ప్రజాస్వామ్యం పారదర్శకంగా ఉండాలన్న ఆలోచనతోనే ఈ ప్రక్రియ చేపట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది. బీహార్లో ప్రత్యేక ఏజెన్సీ ద్వారా అధ్యయనం చేసిన తరువాత మాత్రమే ఈ ప్రక్రియ చేపట్టినట్లు చెప్పుకోస్తోంది ఈసీ.
అటువంటి ఓట్లకు చెక్..
వాస్తవానికి ప్రతి రాష్ట్రంలోనూ మరణించిన వారి పేరుతో ఓట్లు ఉంటున్నాయి. వలస వెళ్లిన వారి పేరుతో ఓట్లు ఉంటున్నాయి. ఒక్కొక్కరికి రెండు చోట్ల కూడా ఓట్లు ఉంటున్నాయి. ఈ విషయంలో ప్రత్యేక సమగ్ర సవరణ( sir) మంచిదే. కానీ ప్రజలతో పాటు మేధావుల సందేహాలను నివృత్తి చేయడంలో మాత్రం ఎలక్షన్ కమిషన్ అనుకున్న స్థాయిలో శ్రద్ధ చూపడం లేదు. అందుకే రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల సంఘం మాత్రం ఈ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారమే జరుగుతోందని స్పష్టం చేస్తోంది. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అనంతరం అభ్యంతరాల స్వీకరణకు అవకాశం కల్పిస్తున్నామని.. అర్హులైన వాటర్లు తమ పేరును తొలగించబడితే సంబంధిత బూత్ లెవెల్ అధికారులను కానీ.. ఈసీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తుంది. తుది జాబితా విడుదలకు ముందు అన్ని అభ్యంతరాలను పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే బీహార్లో తమ ఓట్లు గల్లంతయ్యాయని.. చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో తమ ఓట్లను దూరం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
అభ్యంతరాలతో సరిపెడితే..
ఎన్నికల కమిషన్ అభ్యంతరాలు ఉంటే చెప్పాలని చెబుతోంది. తమ ఓటు ఉందో లేదో తెలుసుకోవాలని సూచిస్తుంది. అయితే ఇప్పటివరకు తమ సొంత ప్రాంతంలో ఓటు వేసేవారు.. తాము నిజంగా ఓటర్లమని ధ్రువీకరించుకోవాల్సి వస్తోంది. దీనిపైనే ఎక్కువగా ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయి. చనిపోయారని చెప్పి చాలా మంది ఓట్లను తొలగించారు. అటువంటి వారు న్యాయస్థానాలను ఆశ్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సమగ్ర సవరణ అనేది మంచి కార్యక్రమమే. కానీ సరైన అధ్యయనం చేయకుండా చేస్తే మాత్రం ఇబ్బందికరమే. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఓటు అనేది ఆయుధం. అటువంటి ఓట్లను సవరించే క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బీహార్లో అధ్యయనం చేసిన తరువాత మాత్రమే మిగతా రాష్ట్రాల్లో చేస్తున్నామని ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. కానీ ఈ అధ్యయనం ఎవరు చేశారు? ఏ సంస్థ చేసింది? ఏమని నివేదిక ఇచ్చింది? అనే విషయాలను మాత్రం ఎలక్షన్ కమిషన్ బయట పెట్టడం లేదు. అందుకే ఇప్పుడు అందరిలోనూ అదే అనుమానం. దేశవ్యాప్తంగా సమాజం పట్ల అవగాహన ఉన్న పౌరులతో పాటు తటస్థులు, మేధావులు ఇదే విషయంపై ప్రశ్నిస్తున్నారు. కానీ ఎన్నికల కమిషన్ నుంచి ఆశించిన స్థాయిలో జవాబు రావడం లేదు.
ఒక అపవాదు ఉండగా…
ఇప్పటికే ఎన్ డి ఏ పై ఒక అపవాదు ఉంది. ఈవీఎంల టెంపరింగ్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. దానిపై ఒక వైపు గలాటా నడుస్తుంటే.. కొత్తగా సమగ్ర సవరణ విషయంలో ఎన్నికల కమిషన్ ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజల సందేహాలను నివృత్తి చేయాలి. రాజ్యాంగబద్ధమైన ఓ స్వతంత్ర సంస్థగా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎన్నికల కమిషన్ పై ఉంది. దానినే గుర్తు చేస్తున్నారు మేధావులు. ఆపై పౌర సమాజం. ఇక తేల్చుకోవాల్సింది ఎన్నికల కమిషన్ మాత్రమే.