Siddha Raghavarao: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి గుడ్ బై చెప్పారు ఒక మాజీ మంత్రి. అయితే ఏడాది కిందట ఆయన రాజీనామా చేశారు. కానీ ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదు. ఇష్టమైన పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. మరో పార్టీలో చేరే ఉద్దేశం లేదు. దీంతో గత ఏడాదికాలంగా ఆయన భగీరథ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే అధినేత చంద్రబాబును కలిశారు. కానీ లోకల్ నాయకత్వం నుంచి అభ్యంతరాలు వచ్చాయి. అయితే ఇప్పుడు స్థానిక నేతలను సముదాయించారు చంద్రబాబు. దీంతో ఆ నేతకు పార్టీలో చేర్పించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఆ మాజీమంత్రి తెలుగుదేశం పార్టీలో చేరుతారని సొంత జిల్లాలో ప్రచారం జరుగుతోంది.
* ఏడాది కిందట రాజీనామా..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అలానే ఆ పార్టీకి రాజీనామా చేశారు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తరువాత రాఘవరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. అలా చేరిన క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ నాయకత్వం ఆయనకు ఒక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే దర్శి టికెట్. గతంలో అదే నియోజకవర్గంలో నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అందుకే ఆ టికెట్ తనకు ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు అంగీకరించలేదు. మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు అయితే అయిష్టంగానే ఆ పార్టీలో కొనసాగారు రాఘవరావు. ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన వెంటనే రాజీనామా ప్రకటించారు. చంద్రబాబుతో ఉన్న తన పాత సాన్నిహిత్యాన్ని గుర్తు చేస్తూ పార్టీలోకి వస్తానని కోరారు. అయితే స్థానిక నాయకత్వం నుంచి అభ్యంతరాలు ఉండడంతో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
* సీనియర్ మోస్ట్ లీడర్..
ప్రకాశం జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్ సిద్దా రాఘవరావు. 1999 నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. 2007లో చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2014లో దర్శి టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచేసరికి తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు రాఘవరావును. ఐదేళ్లపాటు మంత్రి పదవిలో కొనసాగిన ఆయనను 2019 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురయ్యేసరికి రాఘవరావు వైయస్సార్ కాంగ్రెస్ ఒత్తిడికి వెనక్కి తగ్గారు. దర్శి టిక్కెట్ హామీతో ఆ పార్టీలో చేరారు. కానీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. పార్టీ ఓడిపోయేసరికి రాఘవరావుకు స్వేచ్ఛ లభించింది. అందుకే ఇప్పుడు మాతృ పార్టీలో చేరేందుకు చేసిన ప్రయత్నం కూడా ఫలించింది. ఒకటి రెండు రోజుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. కానీ దర్శికి ఇప్పటికే టిడిపి ఇన్చార్జిగా ఉన్నారు గొట్టిపాటి లక్ష్మి. మొన్నటి ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు రాఘవరావు వస్తుండడంతో లక్ష్మీ పరిస్థితి ఏంటి అనేది తెలియడం లేదు. చంద్రబాబు ఇద్దరికీ న్యాయం చేస్తారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?