Volunteer System : వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు పై ఇంకా స్పష్టత లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటుతోంది. వైసిపి హయాంలో ఏర్పాటు చేసిన వాలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. పదివేల రూపాయల వేతనంతో వలంటీర్లను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే వైసీపీ నేతలు అప్పట్లో వలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు గాను.. దాదాపు లక్షన్నర మంది రాజీనామా చేశారు. ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. రాజీనామా చేయని వారు మాత్రం తటస్థంగా ఉన్నారు. తమను ఇప్పుడు కొనసాగిస్తారని ఆశలు పెట్టుకున్నారు. అయితే దీనిపై మంత్రులు భిన్నంగా ప్రకటనలు చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతూనే.. చేర్పులు మార్పులు ఉంటాయని సంకేతాలు ఇస్తున్నారు. వాలంటీర్లు లేకుండానే వరుసగా రెండు నెలల పాటు పింఛన్లు పంపిణీ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. వాలంటీర్లు లేకుండానే పింఛన్లు పంపిణీ చేయగలమని రుజువు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులతో విజయవంతంగా పింఛన్లు పంపిణీ చేయగలిగారు. దీంతో వాలంటీర్లలో ఒక రకమైన భయం కనిపిస్తోంది. అసలు కొనసాగిస్తారా? లేదా? అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. నేటి సాయంత్రం వరకు డెడ్ లైన్ ప్రకటించింది. అంతలో ఆ పని చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అనుమానంతో ఉన్న వాలంటీర్లకు ఈ ప్రకటనతో ఒక రకమైన స్పష్టత వచ్చింది.
* ప్రతి 50 కుటుంబాలతో
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించిన సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాల అమలతో పాటు పౌర సేవలు అందించేందుకు వారిని నియమించింది. నెలకు 5000 రూపాయల గౌరవ వేతనం అందించేది. విధి నిర్వహణలో భాగంగా అవసరమని భావించి సెల్ ఫోన్లను సైతం అందించింది. ప్రతి 50కుటుంబాల వారి ఫోన్ నెంబర్లతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలని.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి వివరాలను అందులో పంపించాలని సూచించింది. దీంతో గత ఐదేళ్లుగా ఈ వాట్సాప్ గ్రూప్ కొనసాగింది.
* వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే రాజీనామా చేసిన వాలంటీర్లు తమ సెల్ఫోన్లతో పాటు సిమ్ లను తిరిగి అందజేశారు.అయితే రాజీనామా చేయని వారి విషయంలో ఇంతవరకు క్లారిటీ లేదు. సానుకూల ప్రకటన వస్తుందని వారు భావిస్తున్నారు. కానీ కొంతమంది టిడిపి నేతలు మాత్రం వలంటీర్ వ్యవస్థ లేకపోవడం మంచిదని భావిస్తున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా తమ క్లస్టర్ల పరిధిలో కుటుంబాలతో ఏర్పాటు చేసిన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
* సాయంత్రం ఐదు గంటల వరకు డెడ్ లైన్
గతంలో తమ క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులను తొలగించాలని సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు సైతం ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి స్వచ్ఛందంగా బయటకు వెళ్లాలని సూచనలు చేసింది. క్లస్టర్ గ్రూపులను ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు డిలీట్ చేయాలని అడ్మిన్ లను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా అటువంటి గ్రూప్స్ నుంచి తక్షణమే ప్రజల ఎగ్జిట్ అవ్వాలని.. అందుకు అనుగుణంగా వారికి సచివాలయం సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించింది.మొత్తానికైతే వాలంటీర్ వ్యవస్థ విషయంలో కొనసాగింపు పై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. కానీ వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం అనుమానాలకు తావిస్తున్నాయి.