TDP Party : టిడిపిలో అసంతృప్తులు పెరుగుతున్నాయా? నేతల్లో ఒక రకమైన నిర్లిప్తత ప్రారంభమైందా? హై కమాండ్ పట్టించుకోకపోవడంతో కొంతమంది నేతలు బాధతో ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈసారి ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో చాలామందికి ఛాన్స్ దక్కలేదు. జనసేన, బిజెపితో పొత్తు మూలంగా.. దాదాపు ఒక 50 మంది నాయకులు చాన్స్ కోల్పోయారు. అందులో హేమహేమి నాయకులు కూడా ఉన్నారు. చివరి నిమిషంలో చంద్రబాబు పిలిచి మాట్లాడేసరికి చాలామంది సీట్లు త్యాగం చేశారు. అటువంటి వారికి అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటుతోంది. కానీ ఇంతవరకు అలా ఎదురు చూస్తున్న వారికి పిలుపు అందడం లేదు. ఫలానా పదవి ఇస్తామని కూడా చెప్పడం లేదు. దీంతో వారిలో ఆవేదన నెలకొంది. మరోవైపు నామినేటెడ్ పదవుల్లో జనసేన, బిజెపికి సైతం సర్దుబాటు చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో పదవులు ఆశిస్తున్న టిడిపి నేతల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అప్పట్లో అధినేత బుజ్జగించి.. తమను పక్కన పెట్టారని.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పిలిచి కూడా మాట్లాడడం లేదన్న ఆవేదనతో సదరు నేతలు ఉన్నారు. దీంతో టీడీపీలో చిన్నపాటి అసంతృప్తి ప్రారంభమైనట్టు స్పష్టమవుతోంది. ఇది నివురు గప్పిన నిప్పులా మారకముందే.. మేల్కొనాల్సిన అవసరం ఉంది.
* సీనియర్లకు దక్కని టిక్కెట్లు
టిడిపిలో సీనియర్లు అయిన దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్రప్రసాద్, బుద్ధ వెంకన్న, అశోక్ గజపతిరాజు, దాడి వీరభద్రరావు, కొనకల్ల నారాయణ వంటి వారు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అనేక జిల్లాల్లో నాయకులు పోటీకి సిద్ధమైన తరువాత చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. ఈసారి పొత్తులో భాగంగా ఎక్కువ సర్దుబాట్లు చేయాల్సి వచ్చినందున న్యాయం చేయలేనని.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు సమీపిస్తోంది. కానీ అధినేత నుంచి భరోసా లేకపోవడంతో క్షేత్రస్థాయిలో నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు.
* వర్మది అదే ఆవేదన
పవన్ కోసం పిఠాపురం సీటును వర్మ త్యాగం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తామని వర్మ కు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు వర్మను పట్టించుకోవడం లేదన్న టాక్ నడుస్తోంది. ఇటీవల కార్యకర్తల సమావేశంలో సైతం తన ఆవేదనను వ్యక్తపరిచినట్లు సమాచారం. నాకే దిక్కులేదు నీకేం చేయగలను అంటూ నిట్టూర్చినట్లు తెలుస్తోంది. మరో సీనియర్ నేత బుద్ధ వెంకన్న పరిస్థితి కూడా అలానే ఉంది. పార్టీ కోసం పని చేస్తే పదవులు లేవు కదా.. కనీసం మాట కూడా చెల్లుబాటు కావడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈఇద్దరే కాదు చాలామంది ఇదే రీతిలో బాధపడుతున్నారు.
* పదవుల పంపకాలు
టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో పార్టీ నాయకులు ఆనందపడిపోయారు. తమకు నామినేటెడ్ పదవులు తప్పవని భావించారు. కానీ ఆ పదవుల్లో సైతం.. మూడు పార్టీలకు పంపకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవుల్లో సైతం అదే ఫార్ములాను అనుసరించునున్నారు. ఇది కూడా టిడిపి నేతల్లో అసంతృప్తికి కారణమవుతోంది. చంద్రబాబు గుర్తించి సరిదిద్దుకుంటే పర్వాలేదు… లేకుంటే మాత్రం టిడిపిలో అసంతృప్తి జ్వాలలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.