Janasena party : జనసేనపై కుట్ర జరుగుతోందా? కూటమిని దెబ్బతీయాలని భావిస్తున్నారా? అందుకు ఏపీ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈరోజుతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీల సీట్లు ఆశించిన చాలామంది ఇండిపెండెంట్ గా బరిలో దిగారు. అటువంటి వారికి ఎన్నికల గుర్తును కేటాయిస్తున్నారు. అయితే అనూహ్యంగా వారికి గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం సంచలనం గా మారింది. ఇప్పటికే జనసేనకు ఆ గుర్తు ఉంది. ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న ఆ గుర్తు.. జనసేనకు కామన్ సింబల్ గా కేటాయిస్తూ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీచేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఇండిపెండెంట్ లకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆదేశాలు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందా? లేకుంటే ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది.
విజయనగరం అసెంబ్లీ సీటును మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఆశించారు. కానీ ఆమెకు టికెట్ దక్కలేదు. అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు టికెట్ దక్కించుకున్నారు. దీంతో అక్కడ మీసాల గీత రెబల్ గా బరిలో దిగారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న ఆమెకు తాజాగా గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. జగ్గంపేట టిడిపి టికెట్ జ్యోతుల నెహ్రూ కు దక్కింది. అయితే అక్కడ జనసేన నుంచి సీటు ఆశించిన సూర్యచంద్ర రెబల్ గా బరిలో దిగారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. ఆయనకు సైతం గాజు గ్లాస్ గుర్తును కేటాయించినట్లు తెలుస్తోంది. దీనిపై జనసేన శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కూటమిలోని భాగస్వామ్య పక్షాలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే నిబంధనల ప్రకారమే తాము గాజు గ్లాస్ గుర్తు కేటాయించామని అధికారులు చెబుతున్నారు.
వాస్తవానికి జనసేన గాజు గ్లాస్ గుర్తు రగడ ఈనాటిది కాదు. గత ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి జనసేన పోటీ చేసింది. కానీ ఒకచోట మాత్రమే విజయం సాధించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అనుకున్న ఓట్లు దక్కకపోవడంతో.. జనసేన గాజు గ్లాస్ గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. దీనిపై జనసేన ప్రత్యేకంగా విన్నవించడంతో కామన్ సింబల్ ఇస్తున్నట్లు ఈ రోజే ప్రకటించింది. అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీచేసింది. కానీ ఈ ఉత్తర్వులు అందలేదని ఎక్కడికి అక్కడే ఇలా ఇండిపెండెంట్ లకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం విశేషం. దీంతో అంతటా గందరగోళం నెలకొంది. ఈసీ ఆదేశాలు తప్పకుండా పాటించాలని.. లేకుంటే న్యాయపోరాటం చేస్తామని జనసేన హెచ్చరిస్తోంది. మొత్తానికైతే గాజు గ్లాస్ గుర్తు పెను దుమారానికి దారితీస్తోంది.