YS Sharmila: ఏపీలో లెక్కలు మారుతున్నాయి. సరికొత్త రాజకీయ సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. ఒంటరి పోరుకు సిద్ధమైన జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 60 మంది అభ్యర్థులను మార్చారు. మరో 20 మందిని మార్చుతామని సంకేతాలు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. మధ్యలో బిజెపి జత కలుస్తుందని అంతా భావిస్తున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను షర్మిల తీసుకున్నారు. సోదరుడు జగన్ టార్గెట్ చేసుకున్నారు. చంద్రబాబు పై సైతం విమర్శలు చేస్తున్నారు. కానీ టిడిపి నేతలు మాత్రం పెద్దగా స్పందించడం లేదు.ఈ పరిణామాల క్రమంలో జగన్ ఒకవైపు, విపక్షాలు మరోవైపు అన్నట్టు పరిస్థితి ఉంది.
కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక ఒక సంచలనమే. ఒకప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీని విమర్శించారో.. అదే పార్టీ నీడకు షర్మిల చేరారు. కాంగ్రెస్ లోకి వెళుతూ వెళుతూ జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. తన రాజకీయ భవిష్యత్ కంటే అన్న పతనం కోసమే ఆమె కాంగ్రెస్ లో చేరానన్న ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఏపీలో వైసీపీ సర్కార్ వైఫల్యాలతో పాటు ప్రజా ప్రతినిధుల అవినీతి, దోపిడీని ఆమె ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. అయితే ఆమె కామెంట్స్ పై వైసిపి కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి స్పందించారు. ఆమె తెలంగాణ రాష్ట్ర వాసిగా చెప్పుకొచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నేతలతో పాటు సోషల్ మీడియాలో ఆ పార్టీ శ్రేణులు షర్మిలపై విరుచుకుపడడం ప్రారంభించాయి. అనంతపురంలో పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న జగన్ అయితే షర్మిల పేరు ప్రస్తావించకుండా.. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరిన వ్యక్తి అంటూ షర్మిలపై విమర్శలు చేశారు. షర్మిల సైతం అదే స్థాయిలో ఘాటుగా స్పందించారు.
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఉన్న షర్మిల విశాఖలో జగన్ తో పాటు చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు. ఆ ఇద్దరు నేతలను టార్గెట్ చేసుకున్నారు. ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న బిజెపితో వైసిపి, టిడిపి కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. చంద్రబాబువి కనిపించే పొత్తులని.. జగన్ వి మాత్రం కనిపించని పొత్తులని విరుచుకుపడ్డారు. ఆ మూడు పార్టీలు రాష్ట్రానికి శాపంగా మారాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన అందిస్తుందని.. విభజన హామీల అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
అయితే షర్మిల కేవలం జగన్ తో పాటు చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. ఎక్కడా పవన్ గురించి ప్రస్తావించలేదు. బిజెపికి జనసేన మిత్రపక్షం అయినా.. బిజెపికి పవన్ మిత్రుడిగా ఉన్నా షర్మిల మాత్రం పవన్ జోలికి పోలేదు. ఎలాంటి విమర్శలు చేయడం లేదు. అయితే షర్మిల వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కానీ తమ అధినేత చంద్రబాబు పై విమర్శలను టిడిపి శ్రేణులు తిప్పి కొట్టడం లేదు. పవన్ విషయంలో షర్మిల సానుకూలంగా ఉన్నారు. గతంలో ప్రత్యేక హోదా విషయంలో ఆవేశంగా వ్యవహరించిన పవన్ విషయంలో సైతం షర్మిల తప్పు పట్టడం లేదు. మరోవైపు చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ షర్మిల అని జగన్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె చంద్రబాబును టార్గెట్ చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రధాన టార్గెట్ మాత్రం జగనేనని.. ఆమె వల్ల వైసీపీకి డ్యామేజ్ తప్పదని.. అందుకే వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయని ప్రచారం జరుగుతోంది. షర్మిల ఎంట్రీ తో ఏపీలో రాజకీయ స్వరూపమే మారిపోయింది. మున్ముందు ఇది ఎలా విస్తరిస్తుందో చూడాలి.