YS Sharmila takes a U-turn: ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల( AP Congress chief Sharmila ) సైలెంట్ గా ఉన్నారు. పెద్దగా కనిపించడం లేదు. రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదు. అయితే ఆమె సైలెన్స్ వెనుక కారణం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ ఆమెను తప్పించనుందా అనే అనుమానం కూడా ఉంది. లేకుంటే జగన్మోహన్ రెడ్డితో ఆమె సర్దుబాటు చేసుకున్నారా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆమె యాక్టివ్ గా ఉండేవారు. సమకాలీన అంశాలపై స్పందిస్తుండేవారు. కానీ ఎందుకో ఇటీవల పెద్దగా కనిపించడం లేదు. ప్రెస్ మీట్ లు కూడా నిర్వహించడం లేదు. అయితే ఏదో తేడా కొడుతోంది అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆమె నాయకత్వం మార్పు ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. ఇంకోవైపు రాయలసీమ వేదికగా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తారని కూడా టాక్ నడుస్తోంది. ఇప్పటికే పార్టీని నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అందుకే కొత్తగా ఈ సాహసం చేయరని సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఆమె పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతోంది అనేది చర్చగా మారింది.
కాంగ్రెస్ లో విలీనం చేసి..
తెలంగాణలో ( Telangana) తన తండ్రి పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు షర్మిల. సోదరుడు ఏపీలో రాజకీయాలు చేయడంతో ఆమె అలా రూటు మార్చారని అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే అక్కడ పార్టీని నడిపించలేక కాంగ్రెస్లో విలీనం చేశారు. అదే కాంగ్రెస్ పార్టీకి ఏపీ బాధ్యతలు తీసుకున్నారు. కానీ ఆమె హయాంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందలేదు. పార్టీలో ఉన్నవారు సైతం బయటకు వెళ్లిపోయారు. ఆమె కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం దిశగా తీసుకొస్తారని అప్పట్లో అంచనాలు ఉండేవి. కానీ ఆమె మాత్రం ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉండేవారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేసుకునేవారు. ఈ విషయంలో ఆమె అనుకున్న లక్ష్యం నెరవేరింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అనుకున్న స్థాయిలో ఏపీలో బలం పెంచుకోలేకపోయింది. కూటమి అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతున్నా.. షర్మిల కూటమిపై ఆరోపణలు చేసింది తక్కువే. ఆమె వ్యక్తిగత అజెండాతో పని చేస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఈ క్రమంలో ఆమె మార్పు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.
ప్రత్యేక రాయలసీమ కోసం పార్టీ?
షర్మిల రాయలసీమ( Rayalaseema ) వేదికగా ఒక పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. అదే సమయంలో ఆమె జగన్మోహన్ రెడ్డి పై సైతం విమర్శలు తగ్గించారు. అయితే కుటుంబంలో రాజీ జరిగిందని.. సోదరుడితో ఆమె కలిసి పోతారని పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ బలంగా జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆమె సైలెన్స్ గా ఉన్నారు. ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదు. ఆమె నుంచి రాజకీయ ప్రకటనలు రావడం లేదు. అయితే షర్మిల విషయంలో వైయస్సార్ కుటుంబ అభిమానులు కలుగజేసుకున్నారని.. అందుకే ఆ కుటుంబమంతా కలిసి పోయిందన్న ప్రచారం ఉంది. మొన్ననే వైయస్ జగన్ దంపతులతో షర్మిల కుమారుడు కనిపించాడు. అప్పటినుంచి షర్మిల కూడా పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మాత్రం షర్మిల యూటర్న్ తీసుకుంది అనే అనుమానాలు పెరుగుతున్నాయి. మరి అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి.
