YS Sharmila: వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు అటు కాంగ్రెస్ హై కమాండ్, ఇటు షర్మిల తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్ర నేతలతో చర్చించేందుకు బుధవారం షర్మిల తన భర్త అనిల్ కుమార్ తో కలిసి ఢిల్లీ వెళ్లారు. వైయస్సార్టిపి నేతలకు గానీ.. భద్రతా సిబ్బందికి కానీ చెప్పకుండా వాళ్లు ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.గురువారం షర్మిల సోనియా గాంధీతో భేటీ అవుతారని ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 2న వైయస్సార్ వర్ధంతి ఉన్నందున.. ఈలోపే విలీనంపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం నుంచి స్పష్టమైన హామీ లభిస్తుందని షర్మిల ఆశిస్తున్నట్లు సమాచారం.
గత కొద్దిరోజులుగా విలీనంపై రకరకాల కథనాలు వస్తున్నా.. ఇంతవరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. షర్మిల తెలంగాణ రాజకీయాల వైపే మొగ్గు చూపినట్లు..అందుకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మాత్రం ఆమె స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హై కమాండ్ పెట్టిన షరతుకు షర్మిల ఓకే చేసిందని చెబుతున్నారు. ఆమె పార్టీ విలీన ప్రక్రియ తర్వాత ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది.
తెలంగాణలో తన తండ్రి రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరిట రాజకీయ పార్టీని ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రకు దిగారు. అయినా సరే పార్టీని అనుకున్న స్థాయిలో నిర్మించలేకపోయారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను దించుతానని ప్రకటించారు. కానీ ఆమె పోటీ చేయబోయే నియోజకవర్గంపై కూడా స్పష్టత లేదు.పాలేరు నుంచి రంగంలో దిగుతానని ప్రకటించినా.. అక్కడ ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి సానుకూలత లేదు. దీంతో ఆమె పునరా లోచనలో పడిపోయారు. తీవ్రంగా మదనపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో విలీన ప్రక్రియ తెరపైకి వచ్చింది. అయితే ఆమె తెలంగాణలో రాజకీయాలు చేయడానికి వీలులేదని.. ఏపీలో అయితే ఓకే అని కాంగ్రెస్ పార్టీ షరతు పెట్టింది.
కొద్దిరోజుల పాటు షర్మిల తర్జనభర్జన పడ్డారు. తెలంగాణలో ఉంటే ఆశించిన స్థాయిలో రాణించలేరు. ఏపీలోకి వెళితే సోదరుడు జగన్ పై ఫైట్ కి దిగాల్సి వస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి వెళితేనే భవిష్యత్ ఉంటుందని ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపడి.. కేంద్రంలో అధికారంలోకి వస్తే.. రాజశేఖర్ రెడ్డి తనయగా మంచి అవకాశాలు లభించే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ ఒకటి రెండు రోజుల్లో పూర్తి కానున్నట్లు సమాచారం. దీంతో సోదరుడు జగన్ పై షర్మిల ఫైట్ ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.