https://oktelugu.com/

Kodali Nani : గుడివాడలో నిలువ నీడ కోల్పోయిన కొడాలి నాని.. యజమానుల చేతిలోకి శరత్ థియేటర్!

గుడివాడలో శరత్ థియేటర్ అంటే నాని అడ్డా అని అందరికీ తెలిసిన విషయమే. నిత్యం అక్కడ గడ్డం గ్యాంగ్ ఉంటుంది. ఆ ముఠా అక్కడే సంచరిస్తుంటుంది. టిడిపి వాళ్లు ర్యాలీలు చేస్తే అందులో నుంచి రాళ్లు వచ్చి పడతాయి. కర్రలతో వచ్చి దాడి చేసే వాళ్ళు. ఇది చాలా సందర్భాల్లో వెలుగు చూసింది. గుడివాడ ప్రజలకు సుపరిచితం కూడా. అయితే అలాంటి అడ్డాలో ఇప్పుడు కొడాలి నాని కి ఎంట్రీ లేదు

Written By:
  • Dharma
  • , Updated On : July 17, 2024 / 02:50 PM IST
    Follow us on

    Kodali Nani : గుడివాడ కొడాలి నాని అడ్డా. ఇది మనం చెప్పడం కాదు. గత రెండు దశాబ్దాలుగా కొడాలి నాని చెబుతున్న డైలాగు ఇది. విని విని బోర్ కొట్టిందేమో.. గుడివాడ ప్రజలు ఆయనని ఏకంగా మార్చేశారు. దారుణంగా ఓడించారు. ఎన్నారై వెనిగండ్ల రామును ఎమ్మెల్యేగాఎన్నుకున్నారు. దీంతో కొడాలి నాని అడ్డా కాస్త అడ్డంకి గా మారింది. పరిస్థితి అడ్డం తిరిగింది. ఇప్పటివరకు కొడాలి నానితో పాటు ఆయన అనుచరులు స్వాధీనం చేసుకున్న ఆస్తులకు విముక్తి కలుగుతోంది. ఆ విలువైన ఆస్తులన్నీ అసలైన యజమానులు, హక్కుదారుల చేతిలోకి వెళ్తున్నాయి. తాజాగా గుడివాడలోని శరత్ థియేటర్ యజమానుల చేతిలోకి వెళ్లడం విశేషం.

    గుడివాడలో శరత్ థియేటర్ అంటే నాని అడ్డా అని అందరికీ తెలిసిన విషయమే. నిత్యం అక్కడ గడ్డం గ్యాంగ్ ఉంటుంది. ఆ ముఠా అక్కడే సంచరిస్తుంటుంది. టిడిపి వాళ్లు ర్యాలీలు చేస్తే అందులో నుంచి రాళ్లు వచ్చి పడతాయి. కర్రలతో వచ్చి దాడి చేసే వాళ్ళు. ఇది చాలా సందర్భాల్లో వెలుగు చూసింది. గుడివాడ ప్రజలకు సుపరిచితం కూడా. అయితే అలాంటి అడ్డాలో ఇప్పుడు కొడాలి నాని కి ఎంట్రీ లేదు. పూర్తిగా అక్కడ నుంచి గెంటేశారు. నిజానికి ఆ ధియేటర్ కొడాలి నానిదని అందరూ చెప్పుకుంటారు. కానీ అందులో వాస్తవం లేదు.ప్రభుత్వం మారడం,నిజమైన యజమానులు ముందుకు రావడంతో థియేటర్ను అప్పగించారు స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో గుడివాడలో కొడాలి నాని కబ్జాలో ఉన్న 9 ఎకరాల స్థలాలను హక్కుదారులకు అప్పగించారు. ఆయన అనుచరుల చేతిలో ఉన్న ఆస్తిని సైతం విడిపించి అప్పగిస్తున్నారు.

    ఇప్పుడు తాజాగా శరత్ థియేటర్ను నిజమైన హక్కుదారులకు అప్పగించడం హాట్ టాపిక్ గా మారింది. శరత్ థియేటర్ ఎలవర్తి శ్రీనివాసరావు అనే నాయకుడిది. ఆయన ఒకప్పుడు కొడాలి నాని అనుచరుడు. మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు. కానీ తరువాత టిడిపిలో చేరారు. అయినా థియేటర్ మాత్రం కొడాలి నాని ఆధీనంలోనే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కబ్జా చేశారు. అధికారం నాని చేతుల్లో ఉండడంతో ఎలవర్తి కూడా ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు కొడాలి నాని అధికారానికి దూరం కావడంతో థియేటర్ ఎలవర్తి శ్రీనివాసరావు చేతిలోకి వచ్చింది. అందుకే టిడిపి నేతలకు టీ పార్టీ ఇచ్చారు శ్రీనివాసరావు. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో పాటు టిడిపి నేతలు హాజరయ్యారు. థియేటర్ లో ఉన్న వైసీపీ ఫ్లెక్సీలు, కొడాలి నాని ఫోటోలను పూర్తిగా తొలగించారు. ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది.

    గుడివాడలో కొడాలి నాని ఓడిపోయాక సీన్ మారుతోంది. ఎన్నికల వరకు ఆయన మాస్ లీడర్ గా ఉండేవారు. గుడివాడ అంటే నాని.. నాని అంటే గుడివాడ అన్నట్టు పరిస్థితి ఉండేది. కానీ గుడివాడ మాస్ లీడర్ కాదు.. కబ్జా లీడర్ అంటూ స్థానికులు ముందుకు రావడం ప్రారంభించారు. కొడాలి నాని తో పాటు అనుచురుల చేతిలో ఉన్న భూములను తమకు ఇప్పించాలని అసలైన యజమానులు, హక్కుదారులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో పాటు టిడిపి నేతలు అదే ఉత్సాహంతో ఆ భూములను స్వాధీనం చేసి పనిలో పడ్డారు. ఇప్పటివరకు ఎక్కడి నుంచి అయితే రాజకీయం చేశారో.. అక్కడే కొడాలి నాని కి స్థానం లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల కిందట ఓ కేసు విషయంలో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు కొడాలి నాని. కనీసం మీడియా ముందుకు వచ్చి కూడా ఆయన మాట్లాడడం లేదు. ఇప్పుడు ఏకంగా గుడివాడలోనే స్థానం లేకుండా పోయింది. ప్రస్తుతం కొడాలి నాని ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు.