AP IPS Officers : ఐపీఎస్ ల ధిక్కారస్వరం.. ఏపీ ప్రభుత్వానికి షాక్

ప్రభుత్వం మారిన ప్రతిసారి అధికారుల మార్పు సర్వసాధారణం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 మంది ఐపీఎస్ ల పై వేటు వేసింది. వెయిటింగ్ లిస్టులో పెట్టింది. బిజెపి కొన్ని షరతులు కూడా పెట్టారు. కానీ వాటిని ధిక్కరిస్తున్నారు ఐపీఎస్ అధికారులు.

Written By: Dharma, Updated On : August 28, 2024 1:02 pm

AP IPS Officers

Follow us on

AP IPS Officers :  వైసిపి హయాంలో కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారుల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. అప్పట్లో విపక్షాలను టార్గెట్ చేసిన తీరు అభ్యంతరకరంగా ఉండేది. సాధారణంగాప్రభుత్వానికి అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తారు. కానీ గత ఐదేళ్లుగా కొందరు అధికారులు అతిగా ప్రవర్తించారు. ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారు. అటువంటి వివాదాస్పద ఐపిఎస్ అధికారులకు చంద్రబాబు సర్కార్ పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచింది. వీరు సాధారణంగా డీజీపీ కార్యాలయంలో ఎటువంటి విధులు లేకుండా ఉంటారు. వస్తే కార్యాలయానికి వస్తారు.. లేకపోయినా అభ్యంతరం ఉండేది కాదు. అయితే ఇలా వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులు బెంగళూరు వెళ్లి జగన్ ను కలిశారు. ఇది కూటమి ప్రభుత్వం ఆగ్రహానికి కారణమైంది. అందుకే రెగ్యులర్ గా డిజిపి కార్యాలయానికి వెళ్లి వెయిటింగ్ లో ఉన్న అధికారులు హాజరు నమోదు వేయాలని డీజీపీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు బాహటంగానే వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ కక్షపూరిత చర్యగా అభివర్ణించారు. అయితే గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఎంతోమంది ఐపీఎస్ అధికారులను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని.. కొంతమంది అధికారులు రాజకీయ నేతలుగా మారారని.. అప్పుడు ఎందుకు మాట్లాడలేదని టిడిపి నేతలు ప్రశ్నించడంతో.. వివాదాస్పద అంశంగా మారింది. అయితే డిజిపి కార్యాలయానికి వెళ్లి హాజరు నమోదు చేసే ప్రక్రియను కొందరు అధికారులు విస్మరిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా పట్టించుకోవడం లేదని సమాచారం. దీనిపై తదుపరి యాక్షన్ కు ప్రభుత్వం దిగే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున బదిలీ ప్రక్రియ చేపట్టింది. 16 మంది అధికారులకు పోస్టింగులు దక్కలేదు. గతంలో మాదిరిగా వదిలేద్దామని కూటమి ప్రభుత్వం భావించింది. అయితే మధ్యలో జగన్ ను కలిశారన్న వార్తల నేపథ్యంలో రోజు డిజిపి కార్యాలయానికి వచ్చి.. హాజరు నమోదు చేసి.. సాయంత్రం వరకు ఉండాలని ఆదేశాలు ఇచ్చింది.

* ఆదేశాలను పట్టించుకోవడం లేదు
అయితే ఇప్పటికే తెగింపునకు వచ్చిన సదరు వైసిపి అస్మదీయ అధికారులు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. డిజిపి ఆదేశాలను కూడా వీరు లెక్కచేయని పరిస్థితి ఉండడంతో.. వీరి విషయంలో ఏం చేయాలో అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కచ్చితంగా సీరియస్ యాక్షన్కు దిగితే గానీ వీరు లైన్ లోకి రారని భావిస్తోంది. అందుకు మార్గాలను అన్వేషిస్తోంది. అయితే జగన్ ఆదేశాలతోనే వీరు అలా చేస్తున్నారని అనుమానిస్తోంది.

* ఆ అధికారులు వీరే
డిజిపి ఆదేశాలను ధిక్కరించిన వారిలో ఐపీఎస్ లు సీతారామాంజనేయులు, పివి సునీల్ కుమార్, విశాల్ గున్ని, కేకేఎన్ అన్బురాజన్,తిరుమలేశ్వర్ రెడ్డి,సిద్ధార్థ కౌశల్,మేరీ ప్రశాంతి, జి ఆర్ రాధిక తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చాలామంది ఐపీఎస్ లు సెలవు పై ఉన్నారు. మిగతా వారు మాత్రం డిజిపి ఆఫీసు వైపు చూసేందుకు కూడా ఇష్టపడడం లేదని తెలుస్తోంది. దీంతో వీరందరిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించాలో ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

*వారికి జగన్ భరోసా
అయితే వైసిపి హయాంలో విపరీతంగా రెచ్చిపోయిన అధికారులకు జగన్ భరోసా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే చాలామంది అధికారులు వీఆర్ఎస్ తీసుకున్నారు.ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తే తక్కువ సర్వీసు ఉన్న అధికారులు విఆర్ఎస్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఒక నిర్ణయానికి వచ్చి డిజిపి ఆదేశాలను ధిక్కరిస్తున్నట్లు సమాచారం. మరి కూటమి ప్రభుత్వం వీరి విషయంలో ఎలా ముందుకెళ్తుందో నన్న చర్చ పోలీస్ శాఖలో బలంగా నడుస్తోంది.