Parakamani Case: తిరుపతి( Tirupati) పరకామణి కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో తిరుపతి పరకామణిలో చోరీ జరిగింది. అప్పట్లో విజిలెన్స్ అధికారి పట్టుకొని పోలీసులకు నిందితుడిని అప్పగించారు. అయితే అక్కడికి కొద్ది రోజులకే అదే ఫిర్యాదు చేసిన అధికారితో కోర్టులో రాజీ చేయించారు. ఇందుకుగాను నిందితుడు నుంచి భారీగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారని అప్పటి ప్రభుత్వ పెద్దలపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరకామణి కేసు తెరపైకి వచ్చింది. ఇందులో ఫిర్యాదుదారుడు అనుమానాస్పదంగా మృతి చెందడంతో కేసు మరింత బిగుసుకుంది. లోతైన దర్యాప్తు జరుగుతోంది.
జరిగింది ఇది..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) హయాంలో పరకామణిలో చోరీ జరిగిందన్న కేసు నమోదయింది. అప్పట్లో పరకామణిలో పనిచేస్తున్న రవికుమార్ అనే వ్యక్తి విదేశీ డాలర్లు దొంగిలించారన్న అభియోగాలు ఉన్నాయి. అప్పటికే ఆయనపై అనేక రకాల అనుమానాలు ఉండగా.. ఆయన ఆస్తి సైతం భారీగా ఉంది. అయితే ఓ రోజు టీటీడీ విజిలెన్స్ అధికారిగా ఉన్న సతీష్ కుమార్ అనే వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా విదేశీ కరెన్సీ తో రవికుమార్ను పట్టుకున్నారు. వెంటనే తిరుపతి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు నిందితుడిని అప్పగించారు. కేసు కూడా నమోదయింది. అయితే అక్కడకు కొద్ది రోజులకే ఆ కేసును విత్ డ్రా చేసుకున్నారు సతీష్ కుమార్. లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నారు. అయితే ఓ చోరీ కేసుకు సంబంధించి టీటీడీ పెద్దల ఆదేశం లేకుండా సతీష్ కుమార్ ఎలా రాజీ చేసుకున్నారు అన్నది ఇప్పుడు ప్రశ్న.
టీటీడీ పెద్దల హస్తం లేకుండా..
పరకామణిలో పనిచేస్తున్న రవికుమార్ కు భారీగా ఆస్తులు సమకూరాయి. స్వల్ప కాలంలోనే ఆయన ఎదిగారు. అందరి దృష్టి ఆయనపై ఉంది. అటువంటి సమయంలోనే విదేశీ కరెన్సీ తో పట్టుబడ్డారు. ఒకవైపు కేసు నడుస్తుండగా.. ఉన్నఫలంగా కేసు రాజీ చేసుకోవడం ఏమిటి అనేది అప్పట్లోనే హాట్ టాపిక్. అయితే తెర వెనుక రవికుమార్ ఆస్తులను కొంత మొత్తం టిటిడి కి రాయించి.. మిగతా మొత్తం వైసీపీ పెద్దలు తమ పేరిట రాయించుకున్నారు అన్నది ప్రధాన ఆరోపణ. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు తెరపైకి వచ్చింది. సతీష్ కుమార్ ను సిట్ పిలిపించి ఒకసారి విచారించింది. రెండోసారి ఆయన విచారణకు హాజరయ్యేందుకు వస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. అయితే అది అనుమానాస్పద మృతిగా పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తుంటే.. టీటీడీ మాజీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఆత్మహత్యగా చెప్పారు. దీంతో మరింత అనుమానాలు పెరిగాయి. మరోవైపు మాజీ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డిని విచారించేందుకు సైతం సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే ఒకవైపు దర్యాప్తు చేస్తుండగా ఆత్మహత్యగా ఎలా నిర్ధారణకు వచ్చారు అని కరుణాకర్ రెడ్డికి సైతం నోటీసులు ఇచ్చింది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఇలా ఒకేసారి ఇద్దరు నేతలకు నోటీసులు ఇవ్వడం చిన్న విషయం కాదు. మున్ముందు ఈ కేసులో సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.