Chandrababu On PK: ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో సంచలనాలు నమోదవుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేతులు కలిపారు. శనివారం ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ సమావేశం ఆకస్మికంగా జరిగింది కాదు. చంద్రబాబు అరెస్ట్ తరువాత లోకేష్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ప్రశాంత్ కిశోర్‌తో భేటీ అయ్యారు. ఆ సమయంలోనే టీడీపీకి పని చేయాలని కోరారు. చంద్రబాబు ఈ మధ్య కాలంలోనే పీకేతో జూమ్ సమావేశంలో చర్చించారు. ఇప్పుడు చంద్రబాబు ఆహ్వానం మేరకు ఉండవల్లికి వచ్చారు. ఈ భేటీలో జగన్ బలం, బలహీనతలను ఈ భేటీలో బాబుకు వివరించడంతోపాటు వచ్చే ఎన్నికల కోసం కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
15 రోజులకోసారి భేటీ..
ఏపీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ బలం – బలహీనతలు తెలిసిన వ్యక్తిగా ప్రశాంత్ కిశోర్ టీడీపీ అధినేతలను కలవండం ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పని చేస్తారా.. గెలిపిస్తారా అనే చర్చ మొదలైంది. అయితే.. తాను రాజకీయ వ్యూహకర్తగా పని చేయటం లేదని.. ఐ ప్యాక్‌తోనూ సంబంధం లేని పీకే క్లారిటీ ఇచ్చారు. కేవలం చంద్రబాబు అభ్యర్థన మేరకు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్తే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయనే సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలయ్యే వారకూ ప్రతీ 15 రోజులకు ఒకసారి చంద్రబాబుతో ఒక సమావేశానికి పీకే అంగీకరించినట్లు తెలుస్తోంది.
జగన్ బలం అదే..
ఇక.. జగన్ సంక్షేమ పథకాలు.. గ్రామీణ ఓటర్లలో అనూహ్యంగా బలపడ్డారని. కొన్ని అంశాల్లో ప్రతికూతలత ఉన్నా.. నష్టం చేసే స్థాయిలో లేదని పీకే చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే స్థానాలు.. జనసేనతో వెళ్లటం ద్వారా కలిగే లాభ నష్టాలపైనా పీకే పలు సంస్థల నుంచి వివరాలు సేకరించి చంద్రబాబుకు అందజేసినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా రెండు పార్టీల అభ్యర్థ్దులను వీలైనంత త్వరగా ఖరారు చేసి ప్రజల్లోకి పంపాలని సూచించినట్లు సమాచారం. ఇదే సమయంలో టీడీపీ –జనసేన పొత్తు కారణంగా ఏదో జరిగిపోతుందనే హైప్ క్రియేట్ చేస్తూ ప్రజలను ఆకట్టుకొనే అంశాలను విస్మరించారని తెలిపారని సమాచారం.
హామీలతో ప్రజల్లోకి..
పది హామీలను ఎంపిక చేసి వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రశాంత్ కిశోర్ సూచించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పటం ద్వారా ఆ పథకాలు బాగున్నాయని.. వాటినే కొనసాగిస్తామని చెప్పటం వైసీపీకి సర్టిఫికెట్ ఇచ్చినట్లు అవుతుందని తెలిపాట. సంక్షేమం గురించి తక్కువగా, అభివృద్ధి గురించి ఎక్కువగా ప్రచారం చేయాలని సూచించారని సమాచారం.
మరి కొన్ని సూచనలు..
– అమరావతి గురించి ఆ ప్రాంతంలో మినహా ఎక్కువగా ప్రస్తావన చేయవద్దు.
– జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నష్టం తప్పదు.
– పాలనాపరమైన లోపాలను మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
– ప్రస్తుతం జగన్ పాలనపై కొన్నివర్గాల్లో వ్యతిరేకత కనిపిస్తున్నా..దానిని అందిపుచ్చుకోవటంలో టీడీపీ సక్సెస్ కావడం లేదు.