Amaravati Latest News: అమరావతి రాజధానిపై( Amravati capital ) ఫుల్ ఫోకస్ పెట్టింది చంద్రబాబు. ఒకవైపు అమరావతి నిర్మాణ పనులు కొనసాగుతున్న తరుణంలో అదనపు భూ సమీకరణకు నిర్ణయించింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భూ సమీకరణ అనేది కీలక పని భావిస్తోంది. అయితే ఇప్పటికే తొలి విడతగా సేకరించిన భూములకు సంబంధించిన రైతులకు న్యాయం జరగలేదన్న విమర్శ ఉంది. అయితే దీనిపై సీఎం చంద్రబాబు అమరావతి రైతులకు భరోసా కల్పించారు. సంక్రాంతి తర్వాత అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తామన్నారు. దీంతో రైతులు రెండో విడత భూ సమీకరణకు అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలో రెండో విడత భూ సమీకరణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ పరిధిలోకి వచ్చే ఏడు గ్రామాల్లో.. తాజా భూ సమీకరణ చోటుచేసుకుంది. 16,666 ఎకరాల భూమిని సమీకరించనుంది ఏపీ ప్రభుత్వం.
ఆ సందేహాలను అధిగమించి..
అమరావతిలో భూ సమీకరణకు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan ) గడిచిన మంత్రివర్గ సమావేశంలో సందేహాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నాలుగు రోజుల కిందట మంత్రివర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. క్యాబినెట్ సమావేశంలో భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కూడా. అయితే అంతే వేగంగా నోటిఫికేషన్ రావడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా అదనపు భూ సమీకరణ విషయంలో ప్రభుత్వ పట్టుదల అర్థమవుతుంది. తొలివిడతగా ప్రభుత్వం 34,400 ఎకరాల భూమిని సేకరించింది. తాజాగా ఇప్పుడు 16600 ఎకరాలు సేకరించడానికి నిర్ణయించడంతో అమరావతి అనేది 50 వేల ఎకరాలకు చేరుకోనుంది. ఇది చంద్రబాబు సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయమే. ఇప్పటికే అమరావతి భూ సేకరణ పై ప్రత్యర్థులు వ్యతిరేక ప్రచారం చేయగా.. అనుకూల వర్గాలు సైతం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయినా సరే చంద్రబాబు సర్కార్ దూకుడుగా ముందుకు సాగింది.
అందుకే అదనపు భూమి..
అమరావతిలో నవ నగరాలు నిర్మించాలన్నది చంద్రబాబు( CM Chandrababu) ప్రణాళిక. దీనికి ఇప్పుడున్న భూమి చాలదు. పైగా దేశంలో ఏ రాష్ట్రానికి దొరకని అవకాశం ఏపీకి చిక్కింది. మొత్తం రాజధాని నిర్మాణమే మొదలుకానుంది. అందుకే భారీగా భూ సమీకరణ అవసరం అయింది. ముఖ్యంగా దేశంలోనే అతి పెద్దదైన రైల్వే స్టేషన్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి వాటిని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా సి ఆర్ డి ఏ పరిధిలోకి వచ్చే వైకుంఠపురం, పెద్ద మద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి ప్రాంతాల్లో 7562 ఎకరాలు సేకరించనున్నారు. వడ్డేమాన్, హరిచంద్రపురం, పెద్ద పరిమిలో 9104 ఎకరాలను సమీకరిస్తారు. అయితే భూ సమీకరణకు తగ్గట్టుగానే అమరావతి రైతులకు సంబంధించిన నివాస స్థలాలు, రిటర్నబుల్ ఫ్లాట్లు సంక్రాంతి మరుక్షణం ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. అందుకే ఇంత ధైర్యంగా భూ సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది.
చట్టబద్ధత సైతం..
అయితే ఒక్క స్థలాలు ఇవ్వడమే కాదు.. అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కూడా చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ ను ఏపీ ప్రభుత్వం సంప్రదించింది. అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ తో పాటు చట్టబద్ధత అంశాన్ని వివరించడంలో సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం ఆ ఫైల్ హోం శాఖ పరిధిలో ఉంది. అక్కడ నుంచి మంత్రివర్గ సమావేశానికి వెళ్లనుంది. ఆమోదముద్ర పడిన మరుక్షణం పార్లమెంట్లో అమరావతి పై చర్చించనున్నారు. చట్టబద్ధత కల్పిస్తూ ఆమోదముద్ర వేయనున్నారు.