Senior NTR Vardhanthi: నందమూరి తారక రామారావు( Nandamuri tharaka Rama Rao ).. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. రాముడంటే ఆయనే.. కృష్ణుడు అయినా ఆయనే.. దుర్యోధనుడు అయినా ఆయనే.. కర్ణుడు అయినా ఆయనే. ఇలా ప్రతిపాత్రలోనూ ఒదిగిపోయారు. సజీవంగా నిలిచిపోయారు. పౌరాణికం, జానపదం, భక్తి రసం.. ఇలా ఏ చిత్రాల్లో నటించినా నటనలో మేటి ఆయన. తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవంగా మారారు. వెండితెర వేల్పుగా ఎదిగారు. రాజకీయాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. సినిమా రంగం తో పాటు రాజకీయ రంగంలో ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగారు. ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. అటువంటి మహానేత భౌతికంగా దూరమై నేటికి 30 సంవత్సరాలు అవుతోంది. అయినా సరే తెలుగు నెల ఆయనను మరిచిపోలేదు. ఆ చంద్రార్కం ఆయన ప్రజల మనసులో నిలిచిపోయే ఉంటారు.
* వెండితెర ఇలవేల్పుగా..
1923 మే 28న కృష్ణా జిల్లా ( Krishna district)నిమ్మకూరులో జన్మించారు నందమూరి తారక రామారావు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించారు. పలు చిత్రాలను నిర్మించడమే కాదు దర్శకత్వం కూడా వహించారు. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చి రికార్డ్ సృష్టించారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. చైతన్య రథాన్ని సిద్ధం చేసి జనంలోకి వచ్చారు ఢిల్లీ నాయకులను బెంబేలెత్తించారు తెలుగోడి సత్తా చూపారు. సరికొత్త ఒరవడిని సృష్టించారు. 1983 జనవరి 9న ప్రజల సమక్షంలోనే లాల్ బహుదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
* విప్లవాత్మక పాలనతో..
దేశంలోనే విప్లవాత్మక పాలనను అందించిన ఘనత నందమూరి తారక రామారావు ది. విద్యార్థులకు స్కాలర్షిప్పులు, రిజర్వేషన్లు, స్త్రీలకు ఆస్తి హక్కులో భాగం, మధ్యాహ్న భోజనం, రెండు రూపాయలకు కిలో బియ్యం వంటివి అమలు చేసి చూపించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం, కేంద్రం వివక్ష అన్న నినాదాలను తీసుకొని అధికారంలోకి వచ్చారు నందమూరి తారక రామారావు. మురళీధర్ రావు కమిషన్ దగ్గర నుంచి మండల్ సిఫార్సుల దాకా తెలుగుదేశం వైఖరి సామాజిక న్యాయం వైపు ఉండేది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే సమయంలో బాగా చదువుకున్న యువతకు.. అప్పటిదాకా రాజకీయ అవకాశాలు అందని వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చిన ఘనత నందమూరి తారకరామారావు ది. చట్టసభల్లో సామాన్యులు అడుగుపెట్టడానికి ఆధ్యులు అన్న ఎన్టీఆర్. 1996 జనవరి 18న ఆయన భౌతికంగా దూరమయ్యారు. కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఇప్పటికీ సజీవంగానే ఉంది.
