YS Sharmila : మారిన కాంగ్రెస్ అభిప్రాయం.. షర్మిల అలెర్ట్!

షర్మిల వైఎస్ జగన్ పై గట్టిగానే పోరాడుతున్నారు. అధికారం నుంచి దూరం చేయడానికి కారణమయ్యారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వేరే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : October 29, 2024 12:15 pm

YS Sharmila

Follow us on

YS Sharmila :  షర్మిలకు హై కమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయా? వ్యక్తిగత అజెండాతో ముందుకెళ్తున్నారని ఆక్షేపించిందా? అధికార పక్షం కంటే విపక్షం వైసిపి పై దాడి ఎందుకని ప్రశ్నించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికలకు ముందు పిసిసి పీఠంపై కూర్చున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు శాతం పెరుగుతుందని హైకమాండ్ భావించింది. కానీ ఎన్నికల్లో కనీస స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు సాధించలేదు. కడప పార్లమెంట్ స్థానం నుంచి స్వయంగా పోటీ చేసిన షర్మిల మాత్రం చెప్పుకోదగ్గ ఓట్లు సొంతం చేసుకున్నారు. 1,50,000ఓట్లను సాధించుకున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లను మాత్రం పెంచుకోలేకపోయారు షర్మిల. అయితే ఒక్క విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారు. జగన్ ను అధికారం నుంచి దూరం చేసేందుకు దోహదపడ్డారు. ఏపీలో జగన్ ద్వారా నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ రివేంజ్ ను ఆహ్వానించింది. షర్మిలకు మరింత ప్రోత్సాహం అందించింది. అయితే ఎన్నికల అనంతరం కూడా షర్మిల అదే వైసీపీని టార్గెట్ చేయడానికి మాత్రం హై కమాండ్ తప్పు పట్టినట్లు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోంది. ఇంకా జగన్ ను టార్గెట్ చేయడం ఏమిటని సొంత పార్టీ నుంచి ఒక ప్రశ్న వస్తోంది. దీనిపైనే హై కమాండ్ కు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే ఢిల్లీ నుంచి ప్రత్యేక ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. గత పది రోజులుగా వైఎస్సార్ కుటుంబ ఆస్తి వివాదంపై హైకమాండ్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కొన్ని సూచనలు కూడా చేసినట్లు సమాచారం.

* పార్టీ శ్రేణులకు పిలుపు
తాజాగా షర్మిల విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వచ్చే నెల నుంచి ప్రజా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైసిపి ప్రతిపక్షంగా కూడా ఫెయిల్ అయిందని ఆరోపించారు. గత ఐదేళ్లుగా దోచుకుని తినడం వల్లే ప్రజలు ఆ పార్టీని పక్కన పెట్టారని గుర్తు చేశారు. అందుకే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని ముందంజలో నిలుపుదామని శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే మారిన షర్మిల వాయిస్ చూసి కాంగ్రెస్ హై కమాండ్.. ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లు అర్థమవుతోంది.

* కాంగ్రెస్ కు డ్యామేజ్
ఈడి అటాచ్మెంట్ లో ఉన్న ఓ ఆస్తుల షేర్ బదిలీ విషయంలో జగన్ అభ్యంతరాలు తెలిపారు. తల్లి విజయమ్మతో పాటు చెల్లెలు షర్మిలపై న్యాయ పోరాటానికి దిగారు. అప్పటినుంచి రచ్చ నడుస్తోంది. అయితే దీనివల్ల కాంగ్రెస్ తో పాటు షర్మిల కు డ్యామేజ్ జరుగుతోందన్న విశ్లేషణలు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాలకు దూరమైందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. టిడిపి కూటమి విషయంలో కాంగ్రెస్ పార్టీ సానుకూల ధోరణితో వెళ్తోందన్న ఆరోపణలు వైసీపీ నుంచి వస్తున్నాయి. ఇదే విషయం కాంగ్రెస్ హై కమాండ్ కు చేరినట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి వచ్చిన ఆదేశాలతో వామపక్షాలతో కలిసి ప్రజా పోరాటాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.